చిన్న సినిమాలకు మంచి ఆదరణ ఉన్న ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఎప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi ) కుటుంబం నుంచి ఓ కొత్త హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత చినబాబు (Chinna Babu) సోదరుడి కొడుకు అయిన రుష్య హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా లాంచ్ కానుందని ఇప్పటికే ఓ అప్‌డేట్ వచ్చింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ సినిమా వెనుక ప్రముఖ నిర్మాతలు, టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారని టాక్ నడుస్తోంది.
Naga Vamsi
ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగవంశీ, ఈ ప్రాజెక్ట్‌ను వ్యక్తిగతంగా మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిర్మాణ బాధ్యతలను బెన్నీ ముప్పనేని తీసుకుంటున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘డాన్ బాస్కో’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శంకర్ మెగాఫోన్ పట్టనున్నాడు. ఇప్పటికే ‘జాతిరత్నాలు,’ (Jathi Ratnalu) ‘మ్యాడ్’ (MAD) వంటి హిట్ సినిమాలకు పని చేసిన ఆయన, తన డైరెక్టింగ్ స్కిల్స్‌ను మొదటిసారి ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకోనున్నాడు.
టాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీ జానర్‌కి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నది తెలిసిందే. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరోయిన్‌గా మిర్నాను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా, ఇండస్ట్రీకి మరో యువ హీరోను పరిచయం చేయనుంది. టాలీవుడ్‌కు సంబంధించి ఇప్పటికే పలువురు అగ్రనటులు, దర్శకులు ఈ లాంచింగ్ ఈవెంట్‌కు హాజరవనున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 7న జరగనున్న ఈ ఈవెంట్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు సమాచారం. నాగవంశీ నిర్మాణ బాధ్యతలను తీసుకోకపోయినప్పటికీ, ప్రాజెక్ట్ వెనుక ఆయన్నుంచే పెద్ద స్థాయిలో సపోర్ట్ ఉంటుందని టాక్. కొత్త హీరో ఎంట్రీ ఇవ్వనున్న ఈ సినిమాకు మార్కెట్‌లో ఎలా ఆదరణ లభిస్తుందో చూడాలి.