క్రిష్ సినిమాలో ఎంత తెలుగుదనం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయికలు, విలన్లు తప్ప మిగిలినవంతా తెలుగే. మాటలు, పాటలు, ఆలోచనలు, పేర్లు ఇలా అన్నింటా తెలుగుదనం ఉట్టిపడుతుంటుంది. అందుకుతగ్గట్టే సినిమా పేరులో కూడా తెలుగుదనం ఉట్టిపడుతుంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘కథానాయకుడు’, ‘మహా నాయకుడు’ ఇలా అన్నింటా తెలుగుదనమే. అయితే తన తర్వాతి సినిమా కోసం ఈ అనధికారిక నియమం పక్కన పెట్టబోతున్నాడా? ఏమో మరి.. ఈ విషయంలో చాలా పుకార్లు టాలీవుడ్ వీధుల్లో షికార్లు చేస్తున్నాయి.
వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ లాక్‌డౌన్ సమయంలోనే ముగిసింది. అయితే ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే పేరు పెడతారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇది వర్కింగ్ టైటిల్‌గా కూడా కొనసాగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు వేరే పేరు పెడతారని వార్తలొస్తున్నాయి. అది కూడా ఇంగ్లీష్‌లో. దాంతో ఈ మాటల్ని ఎంతవరకు నమ్మాలో అర్థం కావడం లేదు. సినిమా పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది కాబట్టి.. కాస్త క్లాస్ టచ్ ఇచ్చి ‘జంగిల్ బుక్’ అనే పేరు పెడతారని వార్తలొస్తున్నాయి.
క్రిష్ నుంచి ఇలాంటి సినిమా టైటిల్ ఊహించలేం. అందులోనూ ఈ టైటిల్ పెడితే ఇదేదో చిన్న పిల్లల సినిమా అనుకునే అవకాశమూ ఉంది. సినిమా సీరియస్ టాపిక్‌లో రన్ అవుతుందని తెలుస్తోంది. రకుల్ పాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వాటి ప్రకారం చూస్తే ‘జంగిల్ బుక్’ అనే పేరు పెట్టే అవకాశం అస్సలు లేదు. ఇలాంటి పుకార్లు ఆగాలంటే క్రిష్ వీలైనంత త్వరగా ఈ సినిమాకు నామకరణం చేసేయాలి. క్రిష్ గారూ.. తేల్చేయండి సారూ!