మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా కెరీర్ ప్రారంభించిన కోట శ్రీనివాసరావు.. ఇప్పుడు మరో మెగా హీరో సినిమాతో కెరీర్‌ను ముగించారు. అవును మెగాస్టార్ చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాసరావు.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘హరి హర వీరమల్లు’తో కెరీర్ ముగించారు. విలక్షణ నటకు పెట్టని ‘కోట’గా నిలిచిన కోట శ్రీనివాసరావు ఆఖరిగా నటించిన సినిమా ‘హరి హర వీరమల్లు’ సినిమా అని సమాచారం.
క్రిష్ దర్శకత్వం వహించిన సినిమాల్లో కోట శ్రీనివాసరావు పాత్ర అంటే మరపురానిదిగా ఉంటుంది. అందుకు ఓ ఉదాహరణ ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ సినిమాలో కోట శ్రీనివాస రావు పాత్ర చాలా హైలైట్ అయ్యింది. అలాంటి కాంబినేషన్‌ని రిపీట్ చేసేంత కాకపోయినా ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఓ చిన్న పాత్ర రాసుకున్నారు క్రిష్. ‘హరి హర వీరమల్లు’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కోట శ్రీనివాస రావు ఒక రోజు షూటింగ్ చేశారు.
అయితే, క్రిష్ అనుకున్న కథ, స్క్రీన్‌ప్లే ఆ తర్వాత జ్యోతి కృష్ణ కెప్టెన్ కుర్చీలోకి వచ్చాక మారింది. ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావు సన్నివేశాలు సినిమాలో ఉన్నాయా? లేవా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం ఈ నెల 24న తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో వాయిదాల తర్వాత జూలై 24నే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అవుతోంది.
ఇక పవన్ కళ్యాణ్, కోట శ్రీనివాసరావు మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. పవన్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుండి ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ వరకు నటించారు. ‘గోకులంలో సీత’, ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో కలసి నటించారు. వయో సమస్యలతో కోట శ్రీనివాసరావు ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.