కొంతకాలం క్రితం వరకు ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లి షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్ లోకి రావాలంటే బిడ్డ ప్రసవంలా అటుఇటుగా 9 నెలల సమయం పట్టేది. కానీ ఇప్పటి సాంకేతికత వల్ల ఆ వ్యవధి కాస్త తగ్గింది. ఫలితం మాట అటుంచితే రామ్ గోపాల్ వర్మ 5 రోజుల్లోనే సినిమా తీసి అందరినీ అబ్బురపరిచారు. ఈయన సినిమాలు వేగంగా తీస్తాడన్న పేరుంది గానీ అవి ఎప్పుడు మొదలెడతాడో ఎప్పుడు పూర్తి చేస్తాడో అతనికే తెలియదు. అయితే ఇతగాడి అంశతో ఉన్న పూరి జగన్నాధ్ ఇటీవలి కాలంలో స్పీడ్ డైరెక్టర్ గా పేరొందారు. 40 నుండి 60 రోజుల్లో టాలీవుడ్ లో ఓ సినిమా పూర్తయిందంటే.. అది ఖచ్చితంగా పూరి సినిమానే అని ఎవరైనా చెప్పేస్తారు. కథ, కథనం, లొకేషన్లు, ఆర్టిస్టుల డేట్లు అన్ని సరిగ్గా ప్లాన్ చేస్తే మూడు నెలల్లో సినిమా పెద్ద కష్టమేమీకాదు. ఇప్పటి వరకు ఎలా ఉన్న ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు, దర్శకులు కూడా తమ సినిమా విడుదలకు మూడు నెలల్లో ముహూర్తం పెట్టెయ్యాలని ఫిక్స్ అయిపోతున్నారు.
వీరిలో ముందు చెప్పుకోవాల్సిన పేరు విక్టరీ వెంకటేష్. సెప్టెంబర్ 19 ‘గురు’ సినిమా షూటింగ్ మొదలెట్టిన ఈ సీనియర్ హీరో ఈ సినిమాని మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిరాశయించారు. సినిమా చిత్రీకరణకు మునుపే ఫస్ట్ లుక్ విడుదల చేశారంటే వెంకీ అండ్ టీమ్ ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఐదువారాల చిత్రీకరణ జరిగిందో లేదో ఇప్పుడు టీజర్ విడుదలకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు దర్శకురాలు సుధా కొంగర కసరత్తులు మొదలెట్టారట. దీపావళి సందర్బంగా ఈ నెల 20న ‘ఇరుది సుట్రు/ సాలా ఖాడూస్’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ‘గురు’ టీజర్ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే అటు అల్లు వారబ్బాయిదీ అదే మాట. హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ నటించనున్న ‘దువ్వాడ జగన్నాధం’ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమవగా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుండి జరుగనుంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాని మూడు నెలల్లో అంటే జనవరి చివరి కల్లా పూర్తి చేసి మార్చ్ లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దేవి శ్రీ సరిగమల పనులు పూర్తి చేశారని సమాచారం. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ కుర్రాడిగా, స్టైలిష్ అవతార్ లో సాగే రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నాడట. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కోసం ప్రముఖ కళా దర్శకుడు ఎస్ రవీందర్ ప్రత్యేక సెట్స్ సిద్ధం చేస్తున్నారు.