సినిమా విడుదలయ్యేంతవరకు సినిమా మెయిన్ పాయింట్‌ను బయటకు చెప్పకపోవడం నేటి తరం దర్శకుల విధానం. ఆ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ మిస్ కాకూడదని అలా చేస్తుంటాం అని చెబుతుంటారు. అయితే రాజమౌళి లాంటి వాళ్లు ముందుగానే, ఇంకా చెప్పాలంటే సినిమా ప్రారంభం కాగానే సినిమా మెయిన్ పాయింట్‌ను చెప్పేస్తారు. కథ ఇదీ… ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. థియేటర్లో మీ ఊహలను నిజం చేసి చూపిస్తాం అని అంటుంటారు. అలా ఆలోచించే దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘చెక్’. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా మెయిన్ పాయింట్‌ను ఆయన రివీల్ చేసేశారు.
తెలివైన ఓ కుర్రాడు చిన్నప్పుడు రోడ్లపై తిరుగుతుంటాడు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు మోసాలు చేస్తుంటాడు. అలా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత ఆ కేసులో ఏకంగా ఉరిశిక్ష పడుతుంది. ఈ కేసు నుండి ఇక బయటపడటం కష్టం అనుకుంటున్న సమయంలో జైలులో ఓ వ్యక్తి పరిచయంతో తన తెలివితేటల్ని సక్రమమార్గంలో వినియోగించడం మొదలు పెడతాడు. అప్పుడు ఏం జరిగింది అనేదే సినిమా కథ అట. ట్రైలర్ చూస్తే… ఈ సినిమాలో చదరంగం ఆట కీలకం. కథానాయకుడు చెస్ బాగా ఆడతాడు. రాష్ట్రపతి దగ్గర అతని క్షమాభిక్ష పిటిషన్, చెస్ ఆట బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సినిమా నడుస్తుందట. ఈ విషయాలన్నీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటినే చెప్పారు.
పదేళ్లుగా యేలేటి మనసులో ఉన్న ఆలోచన ఆధారంగా రాసుకున్న కథ ఇదట. పదేళ్ల నాటి ఆలోచన రూపాంతరం చెంది ‘చెక్’ రూపంలోకి మారిందట. అంతా బాగుంది… సినిమా మెయిన్ పాయింట్‌ను చెప్పేసి… ప్రేక్షకులను తెర మీదకు తీసుకొస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగా సినిమా థియేటర్లలో అలరించబోతోందా? ఏమో చూడాలి. ఇప్పటికైతే చంద్రశేఖర్ యేలేటి, నితిన్ అండ్ కోకి ఆల్ ది బెస్ట్ చెబుదాం.
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!