పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

“ఖరాబు.. మైండు ఖరాబు” అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మాస్ కుర్రోడ్ని అట్రాక్ట్ చేసిన పాట ఇది. హీరో ఎవరో తెలియకపోయినా రష్మిక ఉందన్న ఏకైక కారణంతో పాట సూపర్ హిట్ అయిపోయింది. ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసేదాకా తీసుకొచ్చింది. తెలుగు-కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ “పొగరు” ఎలా ఉందో చూద్దాం..!!

కథ: సరిగ్గా ఊహ తెలియక ముందే తండ్రిని కోల్పోయి.. తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో చిన్నప్పట్నుంచి తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతాడు శివ (ధృవ్ సార్జా). అందువల్ల మొండి ఘటంగా పెరిగి వీధుల్లో బలాదూర్ తిరుగుతూ కాలనీ వాసులకు తలపోటుగా మారతాడు. డబ్బు కోసం ఎలాంటి వెధవ పనైనా చేసే శివ ఒకానొక సందర్భంలో డబ్బు కోసం సొంత చెల్లెల్ని కూడా విలన్ వద్ద వదిలేయడానికి తీసుకెళతాడు. అలాంటి మొరటోడు అదే వీధిలోని పూజారి కూతుర్ని (రష్మిక మందన్న) ప్రేమిస్తాడు. ఇక ఇంతకు మించి కథ గురించి చెప్పడానికి ఏమీ లేదనుకోండి.. ఓపిక ఉంటే థియేటర్లో సినిమా చూడడమే.

నటీనటుల పనితీరు: కన్నడ ప్రేక్షకులకు ధృవ్ సార్జా ఎలా కనిపిస్తాడో తెలియదు కానీ.. తెలుగు ఆడియన్స్ మాత్రం అతడి వేషధారణను, మాస్ అప్పీల్ ను జీర్ణించుకోవడం చాలా కష్టం. అన్నిటికీ మించి ఆ మాస్ మేనరిజమ్స్ & క్యారెక్టర్ మరీ ఇబ్బందికరంగా ఉంది. అయితే.. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ కి ఈ క్యారెక్టర్ నచ్చే అవకాశాలు లేకపోలేదు. ధృవ్ సార్జా మాత్రం పాత్రలో జీవించేశాడు. రష్మిక మందన్నకు రెండు పాటలు, నాలుగు సీన్లు, చివర్లో హీరోతో హగ్ తప్ప పెద్దగా పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఇవ్వలేదు. తల్లి పాత్రలో పవిత్ర లోకేశ్ సెంటిమెంట్, సంపత్ ఓవర్ యాక్షన్ ను తట్టుకోవడం కాస్త కష్టమే.

సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ డిజైన్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. సినిమాలోని పాటల్ని, ఫైట్లను చిత్రీకరించిన బడ్జెట్ లో కన్నడలో మూడునాలుగు చిన్న సినిమాలు తీసేయొచ్చు. ఆ సెట్స్, పదుల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్స్ అబ్బో గ్రాండియర్ మామూలుగా లేదు. సినిమా కమర్షియల్ గా ఎంత వర్కవుట్ అవుతుంది, జనాలకి నచ్చుతుందో లేదో అనేది తెలియదు కానీ.. నిర్మాతలు ధైర్యంగా పెట్టిన ఖర్చుకు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. విజయ్ మిల్టన్ సినిమాటోగ్రఫీ మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. సాంగ్స్ కొరియోగ్రఫీ బాగుంది. చందన్ శెట్టి మ్యూజిక్ కు ఆల్రెడీ మంచి అప్లాజ్ వచ్చింది. అయితే.. పాటల ప్లేస్ మెంట్ బాగోకపోవడంతో అతడి శ్రమకు తగిన ఫలితం లభించలేదు.

 

దర్శకుడు నందకిశోర్ పాత కథను కొత్తగా ప్రెజంట్ చేయాలనుకోవడంలో తప్పులేదు కానీ.. మాస్ ఎలిమెంట్స్ పేరుతో పైత్యాన్ని ప్రదర్శించడం మాత్రం బాగోలేదు. అన్నిటికీ మించి తల్లీ-కొడుకు మధ్య రిలేషన్ ను ఎస్టాబ్లిష్ చేయడంలోనే భారీగా విఫలమయ్యాడు. దాంతో.. కథలో మెయిన్ ఎలిమెంట్ అయిన మదర్ సెంటిమెంట్ ఎక్కడా పండలేదు. మూల కథలోనే పట్టు లేకపోవడంతో కథనం అనాసక్తిగా సాగుతుంది.

విశ్లేషణ: ఒక పర్తిక్యులర్ రీజనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన సినిమాలను వేరే రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు కాస్త ఆలోచించాలి. ఏదో రష్మిక ఉంది కదా అని పాన్ ఇండియన్ సినిమా రేంజ్ లో బైలింగువల్ రిలీజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేందుకు “పొగరు” మంచి ఉదాహరణ. అయితే.. ఊర మాస్ ఫైట్స్ కోసం, క్లైమాక్స్ లో వచ్చే 10 నిమిషాల WWE రేంజ్ ఫైట్ ఎపిసోడ్ కోసం మాస్ ఆడియన్స్ ఒకసారి ఓపికుంటే ట్రై చేయొచ్చు.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus