దాదాపు 7 ఏళ్ళ నుండి ఒక్క హిట్టు కూడా లేకుండా అల్లాడుతున్నాడు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 2018 లో వచ్చిన ‘టాక్సీ వాలా’ తర్వాత అతను చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్టు కాలేదు. ‘డియర్ కామ్రేడ్’ ‘ఖుషి’ ‘కింగ్డమ్’ వంటి సినిమాలో కొంతలో కొంత పర్వాలేదు అనిపించాయి. అంతే..! ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు మొదటి రోజుకే వాషౌట్ అయిపోయాయి.
కానీ విజయ్ దేవరకొండ మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. యూత్ లో అతనికి ఉన్న క్రేజ్ కూడా తగ్గలేదు. అతని సినిమా వస్తుంది అంటే యూత్ లో అటెన్షన్ గట్టిగానే ఉంటుంది. ఒక్క హిట్టు పడితే చాలు.. అదే మాట్లాడుతుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్ బాగానే ఉంది. ప్రస్తుతం ‘రాజావారు రాణిగారు’ దర్శకుడు రవి కిరణ్ కోలా తో ‘రౌడీ జనార్దన’ అనే సినిమా చేయబోతున్నాడు విజయ్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇది క్రేజీ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అలాగే ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ‘మైత్రి’ సంస్థ దాన్ని నిర్మిస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడితో విజయ్ చేతులు కలిపినట్టు తెలుస్తుంది.
అతనే ‘మనం’ దర్శకుడు విక్రమ్ కె కుమార్. వాస్తవానికి నితిన్ తో విక్రమ్ కుమార్ ఒక సినిమా చేయాలి. కానీ నితిన్ ఫామ్లో లేకపోవడంతో నిర్మాతలు అతన్ని తప్పించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అదే ప్రాజెక్టుకి విజయ్ దేవరకొండని హీరోగా పెట్టుకున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది అని తెలుస్తుంది.