హీరోయిన్ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో తాను చేసే పాత్రకు జీవం పోస్తుంది. ఆమె హీరోయిన్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. పలు చిత్రాలలో పాటలు పాడింది. తెలుగుతో పాటు మళయాళ, తమిళ భాషలలో పలు చిత్రాలలో నిత్యా నటిస్తోంది. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది.
తెలుగుతో పాటు తమిళ, మళయాల, హిందీ భాషల్లో కూడాఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి నిత్యా మీనన్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నటించగా, కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, సీనియర్ హీరోయిన్ గౌతమి, నరేష్, అలనాటి నటి తాళ్ళూరి రామేశ్వరి, తిరువీర్,బాబూ మోహన్, ప్రేమ్ సాగర్ కీలకపాత్రలలో నటించారు. గోమఠేష్ ఉపాధ్యాయ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు.
ఏడు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్ కు యాక్టర్, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇక కథ విషయానికి వస్తే, కుమారి శ్రీమతికి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఆమె తల్లి పెళ్లి చేసుకోమని చెప్తూ, ఉంటుంది. అయితే తాత ఇచ్చిన ఆస్తిని ఆమె బాబాయ్ లాగేసుకుని, శ్రీమతి ఫ్యామిలిని బయటకు తోసేస్తాడు. శ్రీమతి కోర్టు వెళ్తుంది. ఆ ఇంటిని తిరిగి పొందేవరకు తాను పెళ్లి చేసుకోనని శ్రీమతి తల్లికి చెబుతుంది. కోర్టు ఆరు నెలల లోపు 38 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఇంటిని కొనుక్కోవచ్చని తీర్పు చెబుతుంది.
అయితే శ్రీమతి జీతం నెలకు రూ.13 వేలు. ఆరునెలల్లో రూ.38 లక్షలు సంపాదించడం కోసం బాగా ఆలోచించిన శ్రీమతి ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. బార్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. బార్ పెట్టి, ఊర్లో వాళ్ళను అందర్నీ బాగా తాగించి, 38 లక్షల రూపాయలు సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. శ్రీమతి ఆ డబ్బును సంపాదించిందా? ఇంటిని దక్కించుకుందా? ఆఖరికి పెళ్లి చేసుకుందా? లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలానే (Nithya Menen) నిత్యా మీనన్ కుమారి శ్రీమతిగా అద్భుతంగా నటించింది.