నిత్యామీనన్ ఊ’ అనాలే కానీ ఆమెను వెతుక్కుంటూ అవకాశాలొస్తాయని అంటారు. పాత్రలో ఒదిగిపోయే లక్షణమే ఆమెకు అలా అవకాశాలను తెచ్చిపెట్టేలా చేస్తుందని చెబుతారు. ఇటు తెలుగుతో పాటు తమిళ, మలయాళం వంటి మూడు సినీరంగాలను చుట్టేస్తున్న ఆమె ఎక్కడ మంచి పాత్ర దొరికితే నిడివి గురించి ఆలోచించకుండా అక్కడి చిత్రాలు చేసేందుకే ప్రాధాన్యమిస్తుందట.
ఇదే విషయాన్ని లోగడ పలు సందర్భాలలో ఆమె చెప్పుకొచ్చారు కూడా. తెలుగులో “సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి’ చిత్రాల తర్వాత ఇప్పుడామె ఎన్టీఆర్ “జనతాగ్యారేజీ’లో ఒక కథానాయికగా నటిస్తోంది. మరోపక్క తమిళ చిత్రాలతో కూడా ఆమె బిజీగా ఉంటోంది. “కాదల్ కన్మణి’, “కాంచన 2’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఇప్పుడామె “24’ చిత్రంలోనూ, సుదీప్ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం, విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న “ఇరుముగన్’ చిత్రంలోనూ నటిస్తోంది.
ఇదిలావుండగా, విభిన్న కథాచిత్రాల దర్శకుడిగా తమిళంలో వసంత్‌కు మంచిపేరుంది. కె.బాలచందర్ స్కూల్ నుంచి వచ్చిన ఆయన ఎట్టి పరిస్థితులలోనూ కథల విషయంలో రాజీపడరని అంటారు. తాజాగా మహిళల ఇతివృత్తంతో వసంత్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో నిత్యామీననే ప్రధాన పాత్రధారిగా ఎంపికైనట్లు పరిశ్రమ వర్గాల భోగట్టా.