నివేదా పేతురాజ్.. ఇప్పటివరకు కనిపించిన విధానం వేరు.. ‘దాస్ కీ ధమ్కీ’ సినిమాలో కనిపించిన స్టైల్ వేరు. ఈ మాట మేం అనడం లేదు. ఆమె ఫ్యాన్స్ అంటున్నారు, ఆఖరికి వాళ్ల అమ్మ కూడా అదే అన్నారట. ‘దాస్ కీ ధమ్కీ’ సినిమా ఈ నెల 22న విడుదలవుతున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గతంలోనే ‘పాగల్’ సినిమాలో విశ్వక్‌సేన్‌తో నటించిన ఆమె.. ఈ సినిమా విషయంలో గమనించిన మార్పులు ఏంటి అనే విషయాలు చెప్పారు, అలాగే తను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుందో కూడా వివరించారు.
ప్రభుదేవాతో ఓ తమిళ సినిమా చేస్తున్నప్పుడు ‘నువ్వు తెలుగులో నటిస్తుంటావు కదా, ఇక్కడికెందుకొచ్చావు’ అని అడిగారట. ‘బాగా డాన్సులు చేసి, ఎక్కువ పారితోషికం తీసుకొచ్చేయ్’ అని ప్రభుదేవా చెప్పారని నివేదా చెప్పారు. ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలో గ్లామర్ పాత్ర అనేసరికి భయపడిన నివేదా.. ఆ పాత్ర కోసమని బరువు తగ్గి.. చాలా మారిపోయిందట. సినిమా పూర్తయ్యాక లుక్, డ్యాన్స్ వీడియోలు వాళ్ల అమ్మకి పంపిస్తే ‘బాగుంది, నువ్వు ఇప్పటిదాకా ఇలా చేయలేదు ఎందుకు’ అని అడిగారట.
హీరోలు సినిమాలు ప్రొడ్యూస్ చేయడాన్ని నేను చూశాను. అయితే విశ్వక్‌సేన్ డైరెక్షన్ కూడా చేశాడు. తొలుత సినిమా విషయంలో భయపడినా.. విశ్వక్ అంతా సాఫీగా పూర్తి చేశాడు. అయితే దర్శకత్వం చేయాలనుకుంటే మరో హీరోతో సినిమా చేయమని విశ్వక్‌కి చెప్పాను. బాలకృష్ణ లాంటి హీరోతో విశ్వక్ సినిమా చేస్తే బాగుంటుంది అని కూడా చెప్పాను. విశ్వక్‌కి గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే పిచ్చి. అప్పుడప్పుడూ కొన్ని కథలు వినిపించాడు కూడా అని చెప్పింద నివేదా పేతురాజ్.
తమిళంలో అజిత్ లాగా తెలుగులో రేసింగ్‌ని ఇష్టపడే కథానాయకులు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్, నాగచైతన్య రేసింగ్ గురించి మాట్లాడుతుంటారు. నాకూడా అలాంటి కథలు ఇష్టమే. అయితే ఆ సినిమాలు చేయడం కష్టం. కొంతమంది అలాంటి కథలు చెప్పినా.. చేయలేదు. అలాగే ప్రముఖ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా జీవితం నేపథ్యంలో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాను. అలాగే సౌందర్య కూడా ఇష్టమే. కానీ ఆమె పాత్ర నిత్య మీనన్ చేసే బాగుంటుందని నా ఆలోచన అని చెప్పింది నివేదా.