కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ఓటీటీల జోరు మొదలైంది. అక్టోబర్ లో థియేటర్లు తెరుచుకోమని పర్మిషన్లు ఇచ్చినా.. పూర్తి స్థాయిలో అయితే థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో ఓటీటీల హవా కొనసాగుతూనే ఉంది. గత రెండు, మూడు నెలలుగా ఓటీటీలో రికార్డు స్థాయిలో కొత్త చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సౌత్ విషయానికొస్తే.. గత నెలలో రిలీజైన ‘ఆకాశం నీ హద్దురా’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘అంధకారం’, ‘మా వింత గాథ వినుమా’ లాంటి సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇదే జోరు డిసెంబర్ లో కూడా సాగుతుందని ప్రేక్షకులు ఆశించారు.
కానీ ఈ నెల నిస్సారంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్యనే థియేటర్లు పునః ప్రారంభమయ్యాయి. కానీ వాటిలో ప్రదర్శించడానికి పేరున్న సినిమాలు అందుబాటులో లేవు. హాలీవుడ్ సినిమా ‘టెనెట్’ ఒక్కటే కాస్త ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. ఆ తరువాత థియేటర్లన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ సినిమా జనాలను కానీసం ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం థియేటర్లు వెలవెలబోతున్నాయి. మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదు.
ఈ సమయంలో ఓటీటీలు సైతం ప్రేక్షకుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ నెలలో ఓటీటీలల్లో చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కాలేదు. ‘డర్టీ హరి’ అనే సినిమాను పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తున్నారు. ఇది మినహాయిస్తే పేరున్న సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కావడం లేదు. క్రిస్మస్ కానుకగా ఓటీటీలు కొత్త సినిమా రిలీజ్ లను ప్లాన్ చేయలేకపోయాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి!