హీరోలకు హిట్స్, ప్లాప్స్ అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. థియేటర్లో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీలో వర్కవుట్ అవుతుంటాయి. కరోనా వచ్చాక ఓటీటీ కంటెంట్ చూసేవాళ్లు కోట్లలో ఉన్నారు. అందుకే కంటెంట్ వీక్ గా ఉన్న సినిమాలు కూడా మిలియన్లలో వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. అలాంటిది.. ఇండస్ట్రీలో పేరున్న హీరో నటించిన ఓ సినిమా వంద రోజులు దాటేసినా.. డిజిటల్ రిలీజ్ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆగస్టులో విడుదలైన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్ జరగలేదు. దీనికి కారణం ఏంటా..? అని ఆరా తీస్తే.. రిలీజ్ కు ముందు నిర్మాత అనుకున్న రేట్ కి రిజల్ట్ వచ్చాక సదరు సంస్థ ఆఫర్ చేసిన మొత్తానికి చాలా తేడా ఉందట. నష్టాలను వీలైనంత రికవరీ చేసుకుందామనుకున్న ప్లాన్ వర్కవుట్ కాలేదని టాక్. అందుకే ఇంత జాప్యం జరిగిందని అంటున్నారు. వంద రోజులు అవుతున్నా.. స్ట్రీమింగ్ కాకపోవడం వింతగా ఉంది. ‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్తా సినిమా కూడా నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేసింది.
కానీ నితిన్ సినిమా మాత్రం రాలేదు. ఇక్కడ కొన్ని అంశాలున్నాయి. ఏదైనా సినిమా ఒకవేళ ఓటీటీ సంస్థ నేరుగా కొనే పరిస్థితి లేకపోతే.. వ్యూస్ మోడల్ లో పెట్టి వచ్చిన రెవెన్యూని షేర్ చేసుకోవడమే ఆప్షన్ ఉంటుంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాను ఇలానే థర్డ్ పార్టీ ద్వారా ప్రైమ్ లో పెట్టారు. అందుకే అమెజాన్ తరఫున ఆ సినిమాకి ఎలాంటి యాడ్స్ కనిపించవు. స్టార్ హీరోల సినిమాలకు ఇలా జరగడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
అలాంటిది రెండు దశాబ్దాల యాక్టింగ్ కెరీర్ ఉన్న నితిన్ కి ఇలాంటి పరిస్థితి అంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం ఈ హీరో ‘నా పేరు సూర్య’ ఫేమ్ వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా కొంత బ్రేక్ ఇచ్చారని టాక్.