టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ2’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి జూలైలోనే ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ వాయిదా పడుతూ వచ్చింది. ముందుగా ‘థాంక్యూ’ సినిమాతో పోటీగా రావాలనుకున్నారు. అయితే దిల్ రాజు కన్విన్స్ చేసి వాయిదా వేయించారు. ఆ తరువాత నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాకి పోటీగా వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. మరో సినిమాతో థియేటర్ల కోసం పోటీ రాకుండా ఉండడానికి వీలుగా విడుదల తేదీని మార్చుకున్నారు.
ఎట్టకేలకు ఈ నెల 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయినప్పటికీ థియేటర్ల సమస్య కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే శుక్రవారం నాడు విడుదలైన ‘సీతారామం’, ‘బింబిసార’ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలు థియేటర్లలో బాగా ఆడుతున్నాయి. రోజురోజుకి ఈ సినిమాల కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. వచ్చేవారం కూడా ఈ సినిమాలు రన్నింగ్ లో ఉండడం ఖాయం. కాబట్టి ఈ రెండు సినిమాలు థియేటర్లను వదులుకోవడానికి ఇష్టపడవు.
వీటితో పాటు ఆగస్టు 12న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా కూడా వస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకొని చాలా కాలమవుతుంది. థియేటర్లను కూడా బ్లాక్ చేశారు. మరోవైపు ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా రిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లను టార్గెట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాలన్నీ థియేటర్లను పంచుకున్న తరువాత మిగిలిన థియేటర్లు నిఖిల్ ‘కార్తికేయ2’ సినిమాకి ఇస్తారు.
ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. మొత్తం రికవరీ కావాలంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ కావాల్సి ఉంటుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే గనుక.. థియేటర్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!