మలయాళ దర్శకుడు, తమిళ సంగీత దర్శకుడు, మలయాళ నటి, తమిళ బాలనటితో… తెలంగాణ బతుకమ్మ పాట. ఈ ఒక్క వాక్యం చాలు ఇటీవల విడుదలైన ‘అల్లిపూల వెన్నెల…’ అంటూ సాగే బతుకమ్మ పాట గురించి చెప్పడానికి. ‘బతుకమ్మ’ పాట అంటే తెలంగాణ ఆత్మ కనిపించాలి. కానీ పాటలో చూసినా, పాటను రూపొందించిన వాళ్లను చూసినా ఎక్కడా ఆ ఫీల్ కనిపించడం లేదు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన బతుకమ్మ పాటల్లా… ఇది ఉందా? లేదా ? అనేది తర్వాత చూద్దాం. ముందు అందులో కనిపించిన ప్రముఖ పాత్రల గురించి మాట్లాడుకుందాం.
తెలంగాణ బతుకమ్మ పాట అంటే… ఇక్కడి నటీనటులు ఉంటారని ఆశిస్తాం. కానీ ఈ పాటలో నటించిన రెండు కీలక పాత్రలు మేఖా రాజన్, అనగ. ఇద్దరూ ఇక్కడివాళ్లు కారు. మేఖా రాజన్ మలయాళ నటి కాగా, అనగ తమిళ నటి. ఈ ఇద్దరి నుండి ఇక్కడి ఫీల్ రప్పించడం అంత ఈజీ కాదు. ఇక ఈ పాటను తీర్చిదిద్దిన దర్శకుడు గౌతమ్ మీనన్. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాల గురించి ఆయన అన్ని విషయాలు తెలిసి ఉంటాయి అనుకోవడం అత్యాశే అవుతుంది.
ఇక పాటకు సంగీతం సమకూర్చిన ఏఆర్ రెహ్మాన్ పరిస్థితీ ఇంతే. బతుకమ్మ అంటే తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయం. వీటి గురించి అంతగా తెలిసే అవకాశం లేని ఈ నలుగురూ కలసి పాట చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు పాట ఎలా ఉందో చూద్దాం. ఇప్పటివరకు మనం విన్న బతుకమ్మ పాటలు అంటే…ఓ ఊపు, హుషారు ఉంటుంది. బతుకమ్మ ఆడుతున్నప్పుడు ఆ పాట ప్లే అవుతుంటే తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఏటా బతుకమ్మ సందర్భంగా పదుల సంఖ్యలో పాటలు వస్తుంటాయి. అందులో ఉన్న ఫీల్… ‘అల్లిపూల వెన్నెల..’లో కనిపించలేదు అని చెప్పొచ్చు.