అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “101 జిల్లాల అందగాడు”. రుహాని శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. బాహ్య సౌందర్యం జీవితాలను ఎలా డిస్టర్బ్ చేస్తుంది అనే నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ ఆడియన్స్ ను ఓ మేరకు ప్రభావితం చేశాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: గుత్తి సూర్యనారాయణ (అవసరాల శ్రీనివాస్), తనతోపాటు పని చేసే అంజలి (రుహాని శర్మ)ను ప్రేమిస్తాడు. తనకు బట్టతల ఉందని తెలిస్తే ఎక్కడ అమ్మాయి ఒప్పుకోదో అనే భయంతో విగ్ తో కవర్ చేస్తాడు. అయితే.. ఆ బట్టతల & విగ్ గుత్తి సూర్యనారాయణ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. ఆ మలుపుల నుంచి బట్టతల సమస్యతో గుత్తి సత్యనారాయణ ఎలా బయటపడ్డాడు అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: పాత్ర కోసం పరితపించే అతికొద్ది మంది నటుల్లో శ్రీనివాస్ అవసరాల ఒకడు. నటుడిగా, దర్శకుడిగా తన బెస్ట్ ఇస్తాడు. ఈ చిత్రంలో బట్టతల ఉన్నవాడిగా కనిపించడం కోసం నిజంగానే గుండు కొట్టించుకోవడం అనేది పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కోసం శ్రీనివాస్ అవసరాల పడే తాపత్రయానికి నిదర్శనం. ఈ చిత్రంలో అతడి నటన, బిహేవియర్, మ్యానరిజమ్స్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. చాలా మందికి ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడమే కాక ఎంటర్ టైన్ చేస్తుంది. రుహాని శర్మ అందంతో, అభినయంతో అలరించింది. ఆమె హావభావాల ప్రకటన స్పష్టంగా ఉంది. సినిమాకి ఆమె ప్లస్ అయ్యింది. రోహిణి కామెడీ టైమింగ్ అలరించింది.
సాంకేతికవర్గం పనితీరు: కథకుడిగా దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ ఆలోచన బాగున్నప్పటికీ.. దాని ఆచరణ ఆలోచనాత్మకంగా లేకపోవడం సినిమాకి మైనస్ గా మారింది. ఈ తరహా కథ-కథనం ఆల్రెడీ పలు తెలుగు సినిమాల్లో చూసేశామ్. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన “బాల, ఉజ్దా చమన్” చిత్రాలు ఇంచుమించుగా ఇదే కథాంశంతో తెరకెక్కిన సినిమాలు. దాంతో చాలా సన్నివేశాలు ఆ చిత్రాలను జ్ణప్తికి తెస్తాయి. కామెడీ కూడా చాలా చోట్ల ఫోర్స్డ్ కామెడీలా ఉంటుంది. శక్తికాంత్ అందించిన పాటలు బాగున్నాయి.
నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. సన్నివేశంలోని ఎమోషన్ ను పతాక స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయాడు. కెమెరా, డి.ఐ, సౌండ్ మిక్సింగ్ వర్క్ సోసోగా ఉంది. ప్రీప్రొడక్షన్ కి ఇంకాస్త వర్క్ చేసి, ప్రొడక్షన్ డిజైన్ జాగ్రత్త తీసుకొని ఉంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేది.
విశ్లేషణ: ఆల్రెడీ చూసేసిన కథే, కాకపోతే శ్రీనివాస్ అవసరాల పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి ట్రై చేయాల్సిన సినిమా “101 జిల్లాల అందగాడు”. అయితే.. కొత్తదనం అనేది ఆశించకుండా, కాస్త బోర్ డమ్ ను భరిస్తే టైమ్ పాస్ అయ్యే సినిమా ఇది.