అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి సంచలన విజయం సాధించింది. దర్శకనిర్మాతలు ఊహించినదానికన్నా మించి కలక్షన్స్ వస్తున్నాయి. కొన్నేళ్లు థియేటర్ వైపు వెళ్లని వారు కూడా మహానటిని చూసేందుకు వస్తున్నారు. మహానటి సినిమా తర్వాత అందరి చూపు మహానటుడు, మహానేత ఎన్టీఆర్ బయోపిక్ పై పడింది. వాస్తవానికి ఈ సినిమా బృందంపై ఒత్తిడి కూడా పెరిగింది. బయోపిక్ అంటే అంచనాలు పెరిగిపోవడమే అందుకు కారణం. తాజాగా టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ బయోపిక్‌పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీకి మొదట తేజ దర్శకుడిగా అనుకున్నారు. అతని ఆధ్వర్యంలో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమయింది. కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నారు.
అయినా ఈ సినిమాని పక్కాగా తెరకెక్కించాలని బాలయ్య పట్టుదలతో ఉన్నారు. అటు సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావించిన బాలయ్య.. ముందు రాసుకున్న స్క్రిప్ట్ ని విస్తరించే పనిలో ఉన్నట్టు తెలిసింది. రెండు భాగాలుగా తెరకెక్కించాలని సాయి మాధవ్ బుర్రా తో కలిసి సరిద్దితున్నారని టాక్. ఇక మొదటి పార్ట్ ఎక్కడి వరకు ఉంటుందనే విషయం టీడీపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ ద్వారా బయటికి వచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకే మొదటి పార్ట్‌లో ఉందని ఆయన తెలిపారు. సో మొదటి పార్ట్ సినీ అభిమానులను ఆకట్టుకుంటే.. రెండో పార్ట్ రాజకీయం ఇష్టపడే ఫ్యాన్స్ కి నచ్చేట్టుగా మలుస్తున్నట్టు అర్ధమవుతోంది.