ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించాలని నందమూరి బాలకృష్ణ మొదలు పెట్టిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ కు మొదటి నుండీ ఏదో ఒక ఆటంకం వస్తూనే వుంది. ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటూనే ఉంది. మొదట ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ మొదలు పెట్టగా. కొన్ని కారణాల వలన తేజ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకోవడంతో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. రెండు పార్టులులు గా వస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’.. మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ జనవరి 9నే వస్తుంది అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.
అయితే ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ మాత్రం ఇప్పుడు మరో డేట్ కు మారింది. మొదట ఈ చిత్రాన్ని జనవరి 25న రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ కొన్ని కారణాల వలన ఇప్పుడు డేట్ కు మార్చారు. మరోవైపు ‘వై.ఎస్.ఆర్’ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు. ‘యాత్ర’ చిత్రం కంటే ఒక్క రోజు ముందు అంటే ఫిబ్రవరి 7న ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రాన్ని విడుదల చేయాలనీ ప్రకటించినప్పటికీ.. బాలయ్య – క్రిష్ మాత్రం ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో విడుదల చేయాలని మరో ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఒక వేళ మళ్లీయే వాయిదా పడితే ఈ చిత్రానికి మరిన్ని ఆటంకాలు వాటిల్లే అవకాశం ఉంది. దీనికి అసలు కారణం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రకటన ఫిబ్రవరి మూడో వారంలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకసారి ఎన్నికల ప్రకటన వచ్చాక ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది కాబట్టి , టిడిపి వ్యవస్థాపకుడు సినిమా కాబట్టి ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం చిత్రాన్ని మళ్ళీ వాయిదా వేయాల్సి వస్తుంది. అయితే ‘యాత్ర’ చిత్రం అప్పటికే రిలీజయ్యి రెండు వారాలు పూర్తిచేసుకుంటుంది కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. అయితే ‘ఎన్టీఆర్- మహానాయకుడు’ విడుదల ఇంకా ఆలస్యం అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనడంలో సందేహం లేదు.