తెలుగు చిత్ర పరిశ్రమపై అత్యంత ప్రభావం చూపగల కుటుంబాల్లో మోహన్ బాబుది కూడా ఒకటి. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మోహన్ బాబు తెలుగు నాట ప్రముఖుల్లో ఒకరిగా వున్నారు. ఇటీవల ముగిసిన మా ఎన్నికల్లో మోహన్ బాబు వారసుడు విష్ణు పోటీలో నిలవడంతో వీరి పేర్లు జనంలో బాగా నానాయి. మొత్తానికి కొడుకు కోసం స్వయంగా రంగంలోకి దిగిన పెదరాయుడు తన సర్వశక్తులు ఒడ్డి విష్ణుని గెలిపించాడు.హోరాహోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై గెలుపొందిన మంచు విష్ణు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ వార్తల్లోని వ్యక్తి అయ్యారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇరు వర్గాలు కత్తలు దూసుకోవడంతో పాటు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు విసురుకున్నాయి. అయినప్పటికీ విష్ణు ఎక్కడా బయటపడకుండా సంయమనం పాటించారు. మా ఎన్నికల పుణ్యమా అని మంచు వారి కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే క్రమశిక్షణకు కట్టుబడి వుండే మోహన్ బాబు తన పిల్లల పెళ్లి విషయంలో వారికి స్వేచ్ఛనిచ్చారు. అందుకే కులాంతర వివాహాలకు సైతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మోహన్‌బాబు స్వయానా తన మరదలినే వివాహం చేసుకున్నారు.
ఇక మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య వెరోనికా రెడ్డి వర్గానికి చెందిన అమ్మాయి. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న కుమార్తే వెరినిక. ఇక రెండో కుమారుడు మనోజ్ మాజీ భార్య ప్రణతీ రెడ్డి కూడా రెడ్డి వర్గం అమ్మాయే. అయితే ప్రణతి – మనోజ్‌ల మధ్య మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక మోహన్ బాబు గారాలపట్టీ లక్ష్మీ ప్రసన్న కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు. లక్ష్మీ భర్త బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇలా అన్ని సామాజిక వర్గాలకు తన కుటుంబంలో స్థానం కల్పించారు మోహన్ బాబు.