తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ తన కుమారుడు సంజయ్ ను హీరోగా పరిచయం చేసిన చిత్రం “ఓ పిట్టకథ”. విశ్వంత్, నిత్యాశెట్టి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి చందు దర్శకుడు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ వంటి బడా స్టార్లందరూ ప్రమోట్ చేసిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ పిట్టకథ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి) ఓ అందమైన, స్వచ్ఛమైన గ్రామీణ యువతి. తండ్రికి సహాయపడుతూ హుందాగా జీవితాన్ని గడిపేస్తుంటుంది. ఆమెను ఎప్పట్నుంచో ఇష్టపడుతున్నప్పటికీ.. ఆమెకు మాత్రం చెప్పడు ప్రభు (సంజయ్ రావు). వెంకటలక్ష్మి-ప్రభుల నడుమ సాగుతున్న సైలెంట్ లవ్ స్టోరీలోకి ఎంట్రీ ఇస్తాడు క్రిష్ (విశ్వంత్). ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలోకి వెంకటలక్ష్మి మిస్ అవ్వడం అనే ట్విస్ట్ రావడంతో పోలీస్ ఆఫీసర్ (బ్రహ్మాజీ). ఇంతకీ వెంకటలక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ మిస్టరీని బ్రహ్మాజీ ఎలా ఛేదించాడు? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ ఫలించింది? వంటి ప్రశ్నలకు సమాధానాల సమాహారమే “ఓ పిట్టకథ” చిత్రం.
నటీనటుల పనితీరు: బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ముఖ్యంలో హావభావాలు పెద్దగా కనిపించకపోయినా.. ఎక్స్ ప్రెషన్ లేకపోవడం కూడా ఒక ఎక్స్ ప్రెషన్ లా కవర్ చేసి.. పర్వాలేదనిపించుకున్నాడు. విశ్వంత్ రెండు విభిన్నమైన షేడ్స్ తో ఆకట్టుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ టర్నడ్ హీరోయిన్ నిత్యాశెట్టి వెంకటలక్ష్మి పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. బ్రహ్మాజీ పోలీస్ పాత్రలో జీవించేసాడు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు చందు కథ కంటే కథనం మీద చూపిన శ్రద్ధ ఓ మేరకు సత్ఫాలితాన్నే ఇచ్చింది. ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్, కథానాయకుల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా చక్కగా రాసుకున్న దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కొత్తగా డిజైన్ చేయాలనే తపన కనిపించింది కానీ.. ఆచరణ అగుపించలేదు. దాంతో అప్పటివరకూ పర్వాలేదు అనిపించినా.. చివరికి రొటీన్ అయిపోయింది. సంభాషణల్లో ప్రాసల కోసం ప్రయాస పడకుండా.. సింపుల్ గా అందరూ మాట్లాడుకొనే భాషలోనే ఉండడం సినిమాకి ప్లస్. దర్శకుడిగా, కథకుడిగా చందు తనకు వీలైనంత వరకు సినిమాకి న్యాయం చేయడానికి ప్రయత్నించాడు.
ప్రవీణ్ లక్కరాజు సమకూర్చిన సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. సినిమా జోనర్ కు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు, అలరించాడు.
సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ నీట్ గా ఉంది. నిర్మాతలు అవసరమైనదానికంటే ఎక్కువే ఖర్చు చేశారు.
విశ్లేషణ: బడా స్టార్ల ప్రమోషన్స్, బ్రహ్మాజీ పర్సనల్ ఎఫర్ట్స్, దర్శకుడు చందు దర్శక, రచన ప్రతిభ “ఓ పిట్టకథ” చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్ళినప్పటికీ.. చిత్ర కథానాయకుడు సంజీవ్ ఎక్స్ ప్రెషన్ లెస్ ఫేస్ కారణంగా అదే జనాలు నీరసంగా థియేటర్ నుండి బయటకు వెళ్తారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే విశేషంగా కాకపోయినా.. ఓ మోస్తరుగా అలరించే చిత్రం “ఓ పిట్ట కథ”