ఆఫీసర్

  • June 1, 2018 / 09:25 AM IST

దాదాపు 28 ఏళ్ల తర్వాత రాంగోపాల్ వర్మ-నాగార్జునల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “ఆఫీసర్”. నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంపై విడుదలైన టీజర్ & ట్రైలర్ ల కారణంగా పెద్దగా ఎవరికీ అంచనాలు లేకపోయినా.. కేవలం ఒక దర్శకుడిగా వర్మ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా కోసం చాలా తక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఆ అతి తక్కువ మందినైనా “ఆఫీసర్” అలరించాడా? లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ : నారాయణ్ పసారి (అన్వర్ ఖాన్) చాలా సీనియర్ & మోస్ట్ రెస్పెక్టడ్ పోలీస్ ఆఫీసర్. అయితే.. తన సీనియారిటీని, పోలీస్ డిపార్ట్ మెంట్ లో తనకున్న పట్టుని మిస్ యూజ్ చేస్తూ ఫేక్ ఎన్ కౌంటర్స్ ద్వారా కోట్లలో డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ విషయం తెలుసుకొన్న డిపార్ట్ మెంట్ ఆ కేసును ఇన్విస్టిగేట్ చేయమని శివాజీరావు (నాగార్జున) హైద్రాబాద్ నుంచి ముంబై రప్పిస్తుంది. తాను ఎంతో అభిమానించే వ్యక్తి అయిన నారాయణ్ పసారి మీద ఇన్వెస్టిగేషన్ అవ్వడంతో ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తాడు శివాజీరావు.

ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో నారాయణ్ పసారీని నిర్ధోషిగా వదిలేస్తుంది డిపార్ట్ మెంట్. అయితే.. తనను కోర్ట్ వరకూ లాగిన శివాజీరావును అంత ఈజీగా వదలకూడదు అని ఫిక్స్ అవుతాడు పసారీ. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మలుపు తిరిగాయి అనేది “ఆఫీసర్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు : నాగార్జున తప్ప సినిమా మొత్తం ముఖం తెలిసిన ఆర్టిస్ట్ ఒక్కడు కూడా లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. పాపం వర్మ మీద విపరీతమైన నమ్మకమో లేక తనకు “శివ” లాంటి లైఫ్ టైమ్ హిట్ ఇచ్చాడన్న కృతజ్నతో తెలియదు కానీ.. నాగార్జున తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. పసారీ పాత్రలో నటించిన అన్వర్, మీనాగా నటించిన మైరా సరీన్ లకు సినిమా మొత్తంలో ఎక్కడా లిప్ సింక్ లేకపోవడంతో ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది.

ఇక సినిమాలో చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్స్ కొందరున్నప్పటికీ.. వాళ్ళకి వర్మ ఎక్కడ పడితే అక్కడ పెట్టిన కెమెరాలను వెతుక్కోవడమే సరిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు : రవిశంకర్ పాటలు, నేపధ్య సంగీతం అసలే వర్మ విచిత్రమైన కెమెరా యాంగిల్స్ కి, ఎటూ తేలని కథనానికి బుర్ర వాచిపోయి ఉన్న ప్రేక్షకుడి సహనానికి ఇంకాస్త పెద్ద పరీక్ష పెట్టి థియేటర్ నుంచి పారిపోవాలా, పడుకోవాలో అర్ధం కాక పిచ్చెక్కేలా చేశాడు. ఫ్లో క్యామ్ ను హ్యాండిల్ చేసిన రోహిత్ పెనుమత్స పనితనం కంటే.. అతడి కష్టాన్ని అభినందించాలి. ముఖ్యంగా.. ఆర్టిస్ట్స్ తోపాటు కెమెరా పట్టుకొని పరిగెట్టుకుంటూ నానా పాట్లు పడిన రోహిత్ కు కనీసం టి.ఎస్.ఆర్ అవార్డ్ అయినా ఇవ్వాలి.

ఈ చిత్రంతో వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన “ఫ్లో సౌండ్” ప్రతి చిన్న శబ్ధాన్ని పెద్దగా వినిపించేలా చేయడం తప్ప ఎందుకూ ఉపయోగపడలేదు. వర్మ దర్శకుడిగా ఆకట్టుకుంటాడన్న నమ్మకం ప్రేక్షకుడు ఎప్పుడో కోల్పోయాడు. కనీసం సాంకేతికపరంగానైనా ఆకట్టుకొంటాడేమోనని ఆశగా థియేటర్లకి వచ్చిన జనాల నెత్తిన సుత్తితో కొట్టాడు వర్మ. ముఖ్యంగా తాను ఆల్రెడీ హిందీలో తీసిన “డిపార్ట్ మెంట్” చిత్రాన్నే అటు తిప్పి, ఇటు తిప్పి తీయడం గమనార్హం.

అయ్యా వర్మగారూ.. భవిష్యత్ తరాలకు నిఘంటువు లాంటి మీ దర్శకత్వ ప్రతిభ రోజురోజుకీ అణగారిపోతుండడం అనేది బాధాకరమైన విషయం. వర్మ కనీసం ఈ సినిమాతోనైనా “కమ్ బ్యాక్” అవుతాడేమో అని ఎంతో ఆశగా ఎదురుచూసిన అతికొద్ది అభిమానుల మీద బండను పడేసిన వర్మ, నాగార్జున సినిమా కదా అని థియేటర్లకి వచ్చిన సాధారణ ప్రేక్షకుల సహనంతో బంతాట ఆడేశాడు.

విశ్లేషణ : ఇప్పటివరకూ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అన్నీ చిత్రాల్లోకెల్లా హేయమైన చిత్రం “ఆఫీసర్”. కథ, కథనం, కామన్ సెన్స్ అనేది పక్కన పేట్టేస్తే.. కనీసం సినిమాగా కూడా గుర్తించలేని, భరించలేని చిత్రం “ఆఫీసర్”.

రేటింగ్ : 1/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus