కొన్ని సినిమాల కథలు వివాదాస్పదమవుతుంటాయి. ముఖ్యంగా మతాలు, ఆచారాల అంశాలు టచ్ చేస్తూ సినిమా చేస్తున్నప్పుడు అవి కాంట్రోవర్సీకి దారితీసే అవకాశం ఉంది. బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, ‘ఓజి’ నటుడు ఇమ్రాన్ హష్మీ..ల లేటెస్ట్ మూవీ ‘హఖ్’ చుట్టూ వివాదం ముదురుతోంది. రిలీజ్‌కు ముందే సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
ఈ నేపథ్యంలో హీరోయిన్ యామీ గౌతమ్ రంగంలోకి దిగి, జరుగుతున్న ప్రచారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటంటే.. ‘హఖ్’ మూవీలోని ఓ పాట, కొన్ని సీన్స్ ఇస్లాం మతానికి చెందిన మహిళల హక్కులను ప్రశ్నించేలా ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. సినిమాను వెంటనే ఆపేయాలంటూ భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే సినిమాను బ్యాన్ చేశారంటూ వార్తలు కూడా పుట్టుకొచ్చాయి.

ఈ బ్యాన్ డిమాండ్లపై యాక్ట్రెస్ యామీ గౌతమ్ స్పందించింది. “మా సినిమాకు సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇది ఏ ఒక్క మతానికీ వ్యతిరేకం కాదు. ఈ సినిమా ఎవరినీ కించపరిచేలా ఉండదని సెన్సార్ సభ్యులు కూడా గుర్తించారు. అందుకే అందరూ చూడదగ్గ సినిమా ఇది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు, ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది.

అన్ని వర్గాల వాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే ఈ సినిమా తీశాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది” అంటూ తన సినిమాను బలంగా సమర్థించుకుంది.ఇక ‘హఖ్’ సినిమా విషయానికొస్తే.. ఇందులో ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ లీడ్ రోల్స్ పోషించారు. జ్యోతి దేశ్‌పాండే, ఇన్సోమ్నియా ఫిల్మ్స్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది.
