ఒక్క క్షణం

  • December 28, 2017 / 08:50 AM IST

మెగా ఫ్యామిలీ నుంచి కథానాయకుడిగా పరిచయమైన అల్లు శిరీష్ పరిచయ చిత్రంతో నిరాశపరిచినా అనంతరం “కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు” చిత్రాలతో హీరో మెటీరీయల్ అని ప్రూవ్ చేసుకోవాడానికి కష్టపడ్డాడు. ఈసారి మాత్రం హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ధ్యేయంతో “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నటించిన థ్రిల్లర్ “ఒక్క క్షణం”. ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా.. సినిమా మరి ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : జీవా (అల్లు శిరీష్) తొలిచూపులో ఇనార్బిట్ మాల్ పార్కింగ్ లో పిల్లర్ నెంబర్ B57 దగ్గర చూసిన జ్యోత్స్న (సురభి)ని ప్రేమిస్తాడు. జ్యోత్స్నకి కూడా జీవా అంటే ఇష్టం ఉండడంతో వీరి ప్రేమ వెంటనే పట్టాలెక్కేస్తుంది. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్ళికి కూడా అంగీకరించి, ఇక పెళ్లే తరువాయి అనుకొంటున్న తరుణంలో జ్యోత్స్నకి తారసపడతారు శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్)-స్వాతి (సీరత్ కపూర్) జంట. శ్రీనివాస్-స్వాతిల జీవితాల్లో జరిగినట్లుగానే జీవా-జ్యోత్స్నల జీవితాల్లోనూ సంఘటనలు చోటు చేసుకొంటాయి. ఉన్నట్లుండి ఒకరోజు స్వాతిని పీకకోసి చంపేస్తాడు శ్రీనివాస్, సో, తనను కూడా జీవా అదే విధంగా చంపేస్తాడేమోనని భయపడుతుంటుంది జ్యోత్స్న. అసలు స్వాతిని చంపాల్సిన అవసరం శ్రీనివాస్ కి ఎందుకు వచ్చింది? అప్పటివరకూ అన్నీ సేమ్ టు సేమ్ జరిగాయి కాబట్టి జ్యోత్స్నని కూడా జీవా చంపేస్తాడా? అనేది తెలియాలంటే “ఒక్క క్షణం” సినిమా తప్పకుండా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : మునుపటి చిత్రాలతో పోల్చి చూస్తే అల్లు శిరీష్ నటుడిగా బాగా ఇంప్రూవ్ అయ్యాడనిపించకమానదు. అయితే.. హావభావాల ప్రకటనలో మాత్రం ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. సురభి ఈ చిత్రంలో అమాయకురాలి పాత్రలో అందంగా కనిపిస్తూనే అభినయంతో అలరించింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అలాగే ఎమోషన్స్ ను కూడా చక్కగా పండించింది. అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్రెజన్స్ తక్కువే అయినప్పటికీ.. నటుడిగా తన పాత్రతో కథలో మంచి ఇంపాక్ట్ తీసుకురాగలిగాడు. సీరత్ కపూర్ కూడా పర్వాలేదనిపించుకొంది. ప్రవీణ్, సత్యలు కామెడీతో కాస్త ఆకట్టుకోగా.. దాసరి అరుణ్ కుమార్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో ఆశ్చర్యపరిచాడు. అతడి క్యారెక్టర్ సినిమాకి పెద్ద ఎస్సెట్. తల్లిదండ్రులుగా కాశీవిశ్వనాధ్-రోహిణి రెగ్యులర్ రోల్స్ లో అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. తన నేపధ్య సంగీతంతో సన్నివేశంలోని ఎమోషన్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతోపాటు ప్రేక్షకుడ్ని సినిమాలో లీనం చేయడంలోనూ ముఖ్యపాత్ర పోషించాడు. పాటలు కూడా బాగున్నాయి. కానీ.. “సో మెనీ సో మెనీ” పాట పాపులర్ ఆంగ్ల ప్రయివేట్ మ్యూజిక్ ఆల్బమ్ “షేప్ ఆఫ్ యు”ను తలపించడం గమనార్హం.

శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా నైట్ షాట్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. షార్ప్ యాంగిల్స్ వాడడం అనేది స్క్రీన్ ప్లే పరంగా హెల్ప్ అయ్యింది.ఎడిటర్ కి మేజర్ క్రెడిట్ వెళ్తుంది. రెండు వేర్వేరు జంటల మధ్య జరిగే సంఘటనలే అయినప్పటికీ.. రిపీటెడ్ గా వచ్చే సన్నివేశాలను అర్ధవంతంగా కట్ చేశాడు. దర్శకుడి ఊహాను ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా చూపడంలో ఛోటా కె.ప్రసాద్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న వి.ఐ.ఆనంద్ “ఒక్క క్షణం” విషయంలోనూ అదే ఫార్మాట్ ను నమ్ముకొని రాసుకొన్న స్క్రీన్ ప్లే ప్రశంసార్హం. చాలా కన్ఫ్యూజన్ ఉన్న స్టోరీని ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా తెరకెక్కించిన విధానం మెచ్చుకోవాలి. అయితే.. ఈ కథ మొత్తం కీలకమలుపు తిరగడానికి గల ముఖ్యమైన అంశం చాలా పేలవంగా ఉండడం పెద్ద మైనస్. ఉదాహరణకి “ఛత్రపతి” సినిమాలో ప్రభాస్-సుప్రీత్ ల మధ్య ఫైట్ ఒక పిల్లాడ్ని రక్షించడం కోసం కాబట్టే ప్రేక్షకుడు కూడా పిడికిలి బిగించి మరీ ఆ ఫైట్ లో లీనమైపోయి మనసులో “కొట్టు కొట్టు” అంటుంటాడు. అదే ఫైట్ ఒక చాక్లెట్ కోసమే లేక సిగరెట్ కోసమే జరిగిందనుకోండి అంత ఆసక్తి ఉంటుందా.

“ఒక్క క్షణం”లో లోపించిన అంశం కూడా అదే. ప్యారలల్ స్క్రీన్ ప్లే అనే అంశం కొత్తది, పరిచయం లేని ఇద్దరి జంట జీవితాలు ఒకే విధంగా ప్రయాణించడం, ఒక జంటకి జరిగినదే మరో జంటకీ జరగడం అనేది చాలా ఆసక్తికరమైన అంశం. కథలో కనిపించినంత కొత్తదనం కాన్ఫ్లిక్ట్ పాయింట్ లో కనిపించదు. అసలు సీరత్ కపూర్ మరణానికి కానీ.. ఆ విషయం వెనుకదాగిన సీక్రెట్ సురభికి తెలియడానికి లాజిక్ ఉన్నా ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల ప్రేక్షకుడు సినిమాలో లీనమవ్వలేడు. ఆ కారణంగా సినిమా ఘన విజయం మార్క్ ని అందుకోలేదు.

విశ్లేషణ : రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి చూసి బాగా బోర్ ఫీలైన ప్రేక్షకులకు “ఒక్క క్షణం” మంచి రిలీఫ్ లాంటిది. అయితే.. కథలో ట్విస్ట్ అనేది ఇంకాస్త ఆసక్తికరంగా ఉండి ఉంటే సక్సెస్ రేట్ అనేది ఇంకాస్త పెద్దగా ఉండేది. ఓవరాల్ గా అల్లు శిరీష్ కి ఒక డీసెంట్ హిట్ దొరికినట్లే.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus