ఇప్పుడు పరిస్థితి మారింది కానీ.. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఏదైనా సినిమా విజయం సాధించినప్పుడు దానిని తెలుగులోకి తీసుకొచ్చేద్దాం అనుకునేవారు మన సినిమా జనాలు. అయితే ఇప్పుడు ఈ సీన్ రివర్స్ అనుకోండి. ఈ కాన్సెప్ట్‌లోనే ఓ పాత తెలుగు సినిమా కథను ఇప్పుడు హిందీ సినిమాగా తీస్తున్నారు అని ఓ టాక్ వినిపిస్తోంది. అదే ‘ఓఎంజీ 2’. అదేనండీ ‘ఓ మై గాడ్ 2’. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. అది చూసి కొంతమంది ఔత్సాహికులు ఈ సినిమా కథ ఇప్పటికే తెలుగులో వచ్చింది అని లెక్క కడుతున్నారు.
‘ఓఎంజీ’ వచ్చిన 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘ఓఎంజీ 2’ తీశారు. ఈ సినిమా టీజర్ ప్రకారం శివారాధనలో నిత్యం మునిగే పరమ ఆస్థికుడు (పంకజ్ త్రిపాఠి)కి, దివి నుంచి భువికి దిగి వచ్చిన శివుడు (అక్షయ్ కుమార్)కు మధ్య జరిగే డ్రామా ఈ సినిమా. దర్శకుడు అమిత్ రాయ్ రూపొందించిన ఈ సినిమా కథ మనదే అంటున్నారు కొంతమంది. తెలుగులో 1979లో ‘మా ఊళ్ళో మహాశివుడు’ అనే సినిమా వచ్చింది. ఇప్పటి తరానికి తెలియదు కానీ.. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం అందుకుందట.
గుడి పూజారి సత్యనారాయణ తనకొచ్చిన కష్టాలకు దేవుణ్ని నిందిస్తే రావు గోపాలరావు రూపంలో పరమశివుడు భువికి వచ్చి అతనికి జ్ఞానాన్ని, విముక్తిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు ‘ఓఎంజీ 2’ కూడా ఇలాంటి ఆలోచనతోనే రూపొందింది అంటున్నారు. అయితే సినిమా వస్తే కానీ అసలు విషయం తెలియదు. దీని కోసం ఆగస్ట్ 11 వరకు ఆగాల్సిందే. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో జోకులు కొన్ని కనిపిస్తున్నాయి. ఈ సినిమా మన దగ్గర వచ్చిందని తెలియక మళ్లీ తీసేస్తారేమో అని అంటున్నారు.
అయితే మరికొంతమంది మాత్రం ఎప్పుడో వచ్చిన సినిమా తీయడం పెద్ద కొత్తేం కాదు. మొన్నీమధ్య అంటే పదేళ్లలోపే వచ్చిన సినిమాల్నే మళ్లీ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా మళ్లీ చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు. చూడాలి ఆ సినిమా విజయం సాధిస్తే ఈ సమస్య రావొచ్చు. లేదంటే గప్ చుప్ అంతే.