దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న సినిమా ఇండస్ట్రీపై ఏదోకటి కామెంట్ చేస్తూ.. వ్యవహారశైలిని తప్పు పడుతూ.. వార్తల్లో నిలుస్తున్న దాసరి ఈసారి అవార్డుల పై విమర్శలు ఎక్కుపెట్టారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ సీనియర్లను గౌరవించుకోవాలనే ఉద్దేశ్యంతో జమున, కైకాల సత్యనారాయణలను సన్మానించుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన దాసరి.. ప్రభుత్వాలు ప్రతిభను గుర్తించవని, రికమండేషన్లనే గుర్తిస్తాయని ఆరోపించారు.
జమున, సావిత్రి, అంజలీ, ఎస్వీరంగారావు లాంటివారికి పద్మశ్రీలు లేవంటే ఇంతకంటే దౌర్భగ్యం మరొకటి లేదని మండిపడ్డారు. ప్రతిభ ఉన్న నిజమైన కళాకారులకు అవార్డు దక్కడం లేదని, ముక్కూ మొహం తెలియనివాళ్లకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు ఇస్తారని ఫైరయ్యారు దాసరి. ఈ మాటలు విన్న కొందరు దాసరి కావాలనే కొందరు టాప్ హీరోలను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసుంటారని భావిస్తున్నారు. ఏదేమైనా.. దాసరి అన్న మాటల్లో కూడా కొంచెం నిజముందనే చెప్పాలి. సావిత్రి, ఎస్వీ రంగారావు లాంటి మహానటులను అవార్డులతో సత్కరించుకోకపోవడం మన దురదృష్టకరం.