మామూలుగా సినిమాల మార్కెటింగ్ హీరోల ఆధారంగా జరుగుతుంది అంటారు. స్టార్ డైరక్టర్, టెక్నీషియన్ ఉంటే యాడ్ ఆన్ అవుతారు అంటారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలో ఇది రివర్స్‌లో జరుగుతోందా? అవుననే అనిపిస్తోంది ఆ సినిమా ప్రచార శైలి చూస్తుంటే. మేకింగ్ వీడియోతో ఇటీవల సినిమా ప్రచారాన్ని కిక్ స్టార్ట్ చేశారు. మాంచి ఊపున్న వీడియో రావడంతో అంతా జోష్‌లోకి వచ్చారు. ఈ రోజు ‘దోస్తీ’ పేరుతో ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇదీ సూపర్. అయితే ఈ ప్రచారంలో ఇప్పటివరకు హీరోల కంటే టెక్నీషియన్‌లే ఎక్కువ కనిపిస్తున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’లో హీరోలు ఎవరు అంటే… ఎన్టీఆర్, రామ్‌చరణ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఈ సినిమా ప్రచారం కూడా వారి బేస్ మీదే జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఇటీవల వచ్చిన రెండు ప్రమోషనల్ కాన్సెప్ట్‌లలో కూడా హీరోల కంటే టెక్నీషియన్లే హైలైట్ అయ్యారు. మేకింగ్ వీడియోలో అంతా రాజమౌళి మాయే సాగింది. ఆయన, ఆయన టీమే ఎక్కువ సేపు కనిపించింది. హీరోలు తారక్, రామ్‌చరణ్ అక్కడక్కడ మెరిశారంతే. ఇప్పుడు ‘దోస్తీ’లో సంగీత దర్శకుడు కీరవాణి వంతు వచ్చింది.
ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ‘దోస్తీ’ పేరుతో ఓ సాంగ్ వచ్చింది. ఐదు నిమిషాల ఈ పాటలో హీరోలు తారక్, రామ్‌చరణ్ కనిపించింది ఆరేడు ఫ్రేమ్‌లే. కావాలంటే పాట చూడండి అర్థమవుతుంది. నాలుగు నిమిషాల 19 సెకన్లు దగ్గర హీరోల ఎంట్రీ మొదలవుతుంది. అప్పటివరకు సింగర్స్, మ్యూజిక్ డైరక్టర్, డ్యాన్సర్స్ మాత్రమే కనిపిస్తారు. అట్రాక్టింగ్ ఎలిమెంట్‌ను ఆఖరి వరకు ఉంచడం కోసం హీరోలను ఆఖరున తీసుకొచ్చేరేమో. జక్కన్న స్టైల్ చూస్తే… హీరోల కోసం కూడా ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ సెట్ చేస్తారని అనుకోవచ్చు.