ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు అయినా చిన్న సినిమాలు అయినా ఓటీటీల హక్కులను బట్టి ఆ సినిమాల రేంజ్ డిసైడ్ అవుతోంది. పెద్ద సినిమాల ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతూ డిజిటల్ హక్కుల విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. పెద్ద సినిమాల వల్ల ఓటీటీల సబ్ స్క్రిప్షన్లు పెరుగుతుండటంతో ఓటీటీలు సైతం పెద్ద సినిమాల డిజిటల్ హక్కులపై ఆసక్తి చూపుతున్నాయి. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ పాపులారిటీని సంపాదించుకోగా ఆమె నటించిన ‘ధాకడ్’ ఈ నెల 20వ తేదీన భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది.
అయితే మార్నింగ్ షో నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ రావడంతో పాటు క్రిటిక్స్ సైతం పెదవి విరిచారు. వీకెండ్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు కేవలం 3 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో ఏ సినిమా సాధించని స్థాయిలో దారుణంగా ఈ సినిమా కలెక్షన్లు ఉన్నాయి. రిలీజ్ కు ముందు ఈ సినిమా డిజిటల్ హక్కులను విక్రయించలేదు.
అయితే ఈ సినిమా టాక్, కలెక్షన్ల గురించి తెలుసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ సినిమా ఏ రేటెడ్ సినిమా కావడంతో టీవీ ప్రీమియర్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ కు ఈ సినిమా డిజిటల్ హక్కులను అమ్మాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాను ఏ ఓటీటీ కొనుగోలు చేసినా ఆ ఓటీటీకి కూడా భారీ నష్టం రావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవడం గమనార్హం.