పడి పడి లేచే మనసు

ప్రేమకథలను వైవిధ్యమైన దృష్టికోణంలో తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం “పడి పడి లేచే మనసు”. శర్వానంద్, సాయిపల్లవి జంటగా రూపొందిన ఈ స్వచ్చమైన ప్రేమకథ నేడు విడుదలైంది. హను రాఘవపూడి మునుపటి చిత్రం “లై” డిజాస్టర్ అయినప్పటికీ కొత్త నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా 30+ కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి హను ఆ నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా? ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగాడా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!

కథ : ప్రేమించడం అంటే అవతలి వ్యక్తిని ప్రేమను పొందేప్పుడు కలిగే ఆనందాన్ని మాత్రమే కాదు.. ఆ వ్యక్తి దూరమైనప్పుడు పడే బాధను కూడా ఆస్వాదించాలి. అలాంటి బాధలో కూడా ప్రేమను గెలిపించుకోవడం కోసం ఇద్దరు ప్రేమికులు పడే తపనకు ప్రతిరూపమే “పడి పడి లేచే మనసు” కథాంశం.

తొలిచూపులోనే వైశాలి (సాయిపల్లవి)ని చూసి ప్రేమించేస్తాడు సూర్య (శర్వానంద్). నానా తంటాలు పడి ఆమె ప్రేమను పొందిన సూర్య ఆ ప్రేమ మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ముందే ఇద్దరి నడుమ పెళ్లి విషయంలో పొరపచ్చాలు ఏర్పడతాయి. ఒక రూల్ గీసుకొని ఏడాది తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకొంటారు. వీరు కలవడం ఆ ప్రకృతికి కూడా ఇష్టం లేదేమో.. పెద్ద ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రళయం నుంచి బయటపడిన తర్వాత వీరి ప్రేమకథ ఏ తీరానికి చేరింది, ఈ తీర ప్రయాణంలో సూర్య-వైశాలీలు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది తెలియాలంటే “పడి పడి లేచే మనసు” సినిమా చూడాలన్నమాట.

నటీనటుల పనితీరు : సినిమాకి ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే.. సినిమాలోని నటీనటులందరూ తమ పాత్రలకు అద్భుతంగా న్యాయం చేశారు. శర్వానంద్ రెట్రో లుక్, సాయిపల్లవి నేచురల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. చాలా సన్నివేశాల్లో శర్వా-సాయిపల్లవి పోటీపడి మరీ నటించడం చూడ్డానికి ముచ్చటగా అనిపిస్తుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీశర్మ ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించగా.. హీరో తల్లి పాత్రలో చాన్నాళ్ల తర్వాత నిన్నటితరం కథానాయకి ప్రియా రామన్ కనిపించి ఆకట్టుకొంది. ప్రియదర్శి, కల్పిక గణేష్ లు స్నేహితుల పాత్రల్లో ఆకట్టుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు : దర్శకత్వం, సంగీతం కంటే ముందు ఈ సినిమా విషయంలో మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రఫీ వర్క్. జేకే కలకత్తాను చాలా కొత్తగా, కలర్ ఫుల్ గా చూపించాడు. హీరోహీరోయిన్ల నడుమ కెమిస్ట్రీని వర్షం షాట్స్ లో కవితాత్మకంగా ప్రెజంట్ చేసిన తీరు ప్రశంసనీయం. కొన్ని ఫ్రేమ్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో. విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. “కల్లోలం, పడి పడి లేచే మనసు” పాటల కొరియోగ్రఫీ హృద్యంగా ఉంది. నేపధ్య సంగీతం విషయంలో సౌండింగ్ బట్టి కాకుండా ఎమోషన్ బట్టి జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంకాస్త బాగుండేది.

దర్శకుడు హను రాఘవపూడికి ప్రేమ అంటే ఒక వెర్రి ఉంది. ఒకే మనిషిని జీవితాంతం ప్రేమించడం అనేది స్వచ్చమైన ప్రేమికుడి ముఖ్యలక్షణం. కానీ… హను ఈసారి ఒకడుగు ముందుకేసి.. ఒకే మనిషిని ఒకటికి రెండుసార్లు ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ కు ఆమ్నీషియాను యాడ్ చేసి తెరకెక్కించిన విధానంలో అతడి కళాత్మకత కనిపించినా.. కథనంలో క్లారిటీ మిస్ అయ్యింది. ఆ కారణంగా సినిమాలో ఏదో ఫీల్ ఉంది అనిపిస్తుంది తప్పితే.. ఆ ఫీల్ ఏంటి అనేది మాత్రం అర్ధం కాదు. దానికితోడు పూర్ సి.జి వర్క్ మరియు స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ముఖ్యంగా సాయిపల్లవి క్యారెక్టర్ విషయంలో దర్శకుడు క్రియేట్ చేయాలనుకున్న కన్ఫ్యూజన్ & మిస్టరీ కాస్తా ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయకపోగా.. చిరాకుపుట్టిస్తుంది.

విశ్లేషణ : ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కాకపోతే.. దాని భావాలే వేరు. ఆ భావాన్ని సరిగా వ్యక్తపరచంలో హను ఎప్పుడూ కొత్తదనం చూపిస్తూనే ఉన్నాడు. కానీ.. “పడి పడి లేచే మనసు” విషయంలో ఆ కొత్తదనానికి పైత్యం యాడ్ అవ్వడంతో సినిమా గాడి తప్పింది.

రేటింగ్ : 1.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus