పద్మావత్

  • January 24, 2018 / 06:00 AM IST

“పద్మావతి” అలియాస్ “పద్మావత్” అనే సినిమా విషయంలో జరిగినంత హడావుడి కానీ చెలరేగిన గొడవలు కానీ ఈమధ్యకాలంలో పోలిటికల్ ఇష్యూస్ విషయంలో కూడా అవ్వలేదేమో. సంజయ్ లీలా భన్సాలీ స్వీయ దర్శకత్వంళో తెరకెక్కించిన ఈ చిత్రం రాజ్ పుత్ ల గౌరవాన్ని మంటగలిపేలా ఉందని సదరు వంశ వారసులు బీజేపీ ప్రభుత్వ సహకారంతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీపికా పదుకొణే టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ కీలకపాత్రలు పోషించారు. మరి రాజ్ పుత్ లు భయపడుతున్న స్థాయిలో సినిమాని నిజంగానే చరిత్రను వక్రీకరించేలా చిత్రీకరించారా? ఇంతకీ ఇంత హడావుడి జరిగిన ఈ చిత్రం జనాల్ని ఏమేరకు ఆకట్టుకొంది అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకొందాం..!!

కథ : 14వ దశాబ్ధంలో జరిగిన కథ ఇది. అప్పటి డిల్లీ సుల్తాన్ అయిన అల్లాఉద్దీన్ ఖిల్జీ (రణవీర్ సింగ్) అందగత్తే, ధైర్యవంతురాలు, గుణవతి అయిన చిత్తోర్ మహారాణి పద్మావతి (దీపికా పదుకోణే) మీద మోజు పడతాడు. ఆమెకోసం అత్యంత ధృడమైన రాజ్యంగా పేర్కొనబడే రాజపుటానాలోని చిత్తోర్ కోటపై దాడికి దిగాలనే దురుద్దేశ్యంతో తన సైన్యాన్ని మొత్తాన్ని ఏకం చేసి యుద్ధానికి సన్నద్ధమవుతాడు. అయితే.. రాజపుత్ ల మహారాజు రావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్) పరాక్రమం, ధైర్యం ముందు నిలువడలేక యుద్ధంలో గెలవలేక అతిధి మర్యాద ముసుగులో రతన్ సింగ్ ను బంధించి డిల్లీకి తీసుకెళ్లిపోతాడు. మహారాణి పద్మావతి తన వద్దకు వస్తేనే మహారాజును వదిలిపెడతానని చెబుతాడు ఖిలిజీ.

అయితే.. అపారమైన తెలివితేటలతోపాటు అమోఘమైన ధైర్యసాహసాలు కలిగిన పద్మావతి అతడి దుర్భుద్దికి తగిన గుణపాఠం చెప్పి.. మహారాజును విడిపించుకుంటుంది. తన కోటకి వచ్చి మరీ పద్మావతి తనను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని ఖిలిజీ మొదటిసారి కంటే ఎక్కువ సైన్యాన్ని తీసుకొని ఈమారు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతాడు. వెన్నుచూపని రాజ్ పుత్ వంశ యోధుడు రావల్ రతన్ సింగ్ ను దొంగదెబ్బ తీసి అతడి రాజ్యంలోకి చొరబడతాడు. అయితే.. ఆత్మాభిమానం మెండుగా కలిగిన పద్మావతి రాజ్యంలోని ఆడపడుచులందరితో కలిసి అగ్నికి ఆహుతవుతుందే తప్ప ఖిలిజీని కనీసం తన మొహం కూడా చూడనివ్వదు. ఆ విధంగా రాజ్ పుత్ ల పరాక్రమాన్ని, రాణి పద్మావతి మహోన్నతను, ఖిలిజీ నీచపు యుద్ధ నీతిని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం “పద్మావతి”.

నటీనటుల పనితీరు : “పద్మావతి”గా టైటిల్ పాత్ర పోషించిన దీపికా పదుకోణే కంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది ఆలావుద్దీన్ ఖిలిజీగా నటించిన రణవీర్ సింగ్ గురించి. క్రౌర్యం, పైశాచికం, కామం, నిర్లజ్జ, నిర్దయ వంటి భిన్నమైన భావాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పలికించిన రణవీర్ సింగ్ ను సినిమా చూస్తున్నంతసేపు ద్వేషించినా అతడి నట ప్రతిభను మెచ్చుకోకుండా, ఒక నటుడిగా అతడ్ని ప్రేమించకుండా ఉండలేం. ఖిలిజీ పాత్రలో ఇంతకంటే అద్భుతంగా మరెవ్వరూ నటించలేరేమో అన్నట్లుగా తన మార్క్ వేశాడు రణవీర్. ఇక అందం, అణుకువ, ఆలోచన వంటి అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న మహారాణి పద్మావతిగా దీపికా పదుకోణే తన ఆహార్యం, హావభావాలతో పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసింది.

ఆమె వచ్చస్సు, యశస్సు చూస్తుంటే పద్మావతి పాత్రపై అపారమైన గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా పతాక సన్నివేశంలో అగ్నికి ఆహుతవ్వడానికి సిద్ధమవుతూ జ్వాలాగ్నిలో కలిసిపోయేప్పుడు కేవలం కళ్ళతోనే ఆమె పలికించిన ధైర్యం చూసి కళ్ళు చెమర్చడమే కాదు మనకు తెలియకుండానే పద్మావతి తెగువకు నమస్కరించాలనిపిస్తుంది. రావల్ రతన్ కుమార్ పాత్రలో షాహిద్ కపూర్ ఒక రాజ్ పుత్ గా ప్రదర్శించిన పరిణితి బాగుంది. కాకపోతే.. సన్నివేశంలోని ఎమోషన్ తో సంబంధం లేకుండా ప్రతి సన్నివేశంలో సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో కనిపించడమే కాస్త ఇబ్బందికరం.

సాంకేతికవర్గం పనితీరు : సినిమాటోగ్రఫీ వర్క్, సెట్ వర్క్, ఆర్ట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ప్రతి ఫ్రేమ్ లో 14వ దశాబ్ధాపు రాజరికాన్ని ప్రతిబింబించడానికి చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులకు ఒక అద్భుతాన్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. పద్మావతి వీరగాధలో ముఖ్యపాత్ర పోషించిన చిత్తోర్ కోటలో చిత్రీకరణ జరపడం వల్ల చరిత్రపుటల్ని ప్రేక్షకులకు జ్ణప్తికి తెచ్చినట్లయ్యింది. సంచిత్ బల్హారా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేసింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా కంపోజ్ చేసిన ట్యూన్స్ మాత్రం ఆకట్టుకొనే స్థాయిలో లేవు.

నిజానికి సినిమాని 150 కోట్ల రూపాయలతో నిర్మించినప్పటికీ విడుదలలో జరిగిన జాప్యం కారణంగా 200 కోట్లకి చేరింది. దాంతో సౌత్ ఇండియాలో హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించబడిన చిత్రంగా “పద్మావతి” నిలిచింది. అయితే ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అయితే.. సినిమా మొత్తంలో అసహజంగా కనిపించేవి పద్మావతి ఇంట్రడక్షన్ సీన్ లో వేసిన అడవి సెట్ మాత్రమే. అది ఇండోర్ సెట్ అనే విషయం బ్రైట్ లైటింగ్ వల్ల చాలా సునాయాసంగా తెలిసిపోతుంది. అలాగే ఖిలిజీ కదనరంగంలోకి దూకే సన్నివేశంలో సీజీ వర్క్ తేలిపోయింది. లాంగ్ షాట్ లో జర్క్స్ ఎక్కువయ్యాయి. అయితే.. సినిమాని త్రీడీలో తెరకెక్కించకుండా కేవలం కన్వర్ట్ చేయడం వల్ల సినిమాని త్రీడీలో చూడడం వల్ల పెద్దగా అనుభూతి పొందేదేమీ ఉండదు. టైటిల్ కార్డ్స్ మినహా సినిమాలో త్రీడీ ఎఫెక్ట్స్ మరెక్కడా కనిపించకపోవడం గమనార్హం.

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మరి పరిస్థితులకు తలొగ్గాడో లేక చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తపడ్డాడో తెలియదు కానీ.. నిజమైన చరిత్రను చూపించడం మీదకంటే రాజ్ పుత్ ల ధార్యసాహసాలను పొగడడం, వారి పరాక్రమాన్ని వెండితెరపై ప్రదర్శించడానికే మొగ్గు చూపాడు. అసలు ఎంతో కీలకమైన పద్మావతి చిన్ననాటి కథను కనీసం టచ్ చేయలేదు. ప్రస్తుత శ్రీలంక అయిన సింహళ రాజ్యానికి యువరాణి అయిన పద్మావతి ఎందుకని ఆహారం కోసం వేటాడాల్సి వస్తుంది, ఎందుకని అందమైన కోటలను వదిలి అడవిలోని ఓ గుహలో ఎందుకు నివాసముంటుంది. అసలు రాణి పద్మావతి ధైర్యవంతురాలిగా మారడానికి కారణమైన కీలకమైన సంఘటలను చూపకపోవడంతో ఆమె పాత్ర ఔన్నిత్యం పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వలేదు.

వీటన్నిటికంటే చాలా చోట్ల చరిత్రను కాస్త వక్రీకరించడం జరిగింది. నిజానికి పద్మావతి చరిత్రను బేస్ చేసుకొని రాసిన గ్రంధాల ప్రకారం ఖిల్జీ సుల్తాన్ పద్మావతిని చూడడం కోసం చిత్తోర్ కోటకు విచ్చేసినప్పుడు పద్మావతికి బదులుగా ఆమె చెలికత్తెను చూపించీ చూపనట్లుగా అతడికి చూపుతారు. అయితే.. సినిమాలో పద్మావతి స్వయంగా కనిపించినట్లుగా చిత్రీకరించారు.

అలాగే.. ఖిల్జీ సుల్తాన్ చిత్తోర్ రాజు రావల్ రతన్ సింగ్ ను తన వద్ద బందీగా పెట్టుకొని పద్మావతిని తన వద్దకు రప్పించుకోవడం కోసం చేసే విఫలయత్నంలో నిజానికి పద్మావతి డిల్లీ రాదు, చిత్తోర్ నుంచే కథ మొత్తం నడిపిస్తుందని కొన్ని పుస్తకాలు చెబుతున్నాయి. సంజయ్ లీలా భన్శాలీ మరి ఎక్కడ నుంచి స్పూర్తి పొందాడో ఎంత రీసెర్చ్ చేశాడో కానీ.. కొన్ని సన్నివేశాలను అత్యద్భుతంగా తెరకెక్కించగా, ఇంకొన్ని సన్నివేశాలను పేలవంగా తీర్చిదిద్దాడు. ఖిల్జీ సుల్తాన్ మొదటిసారి దండయాత్ర జరిపే ఎపిసోడ్ మొత్తం చాలా పేలవంగా ఉంటుంది. కానీ.. పతాక సన్నివేశంలో రాజ్ పుత్ మహిళలు అందరూ తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం అగ్నికి ఆహుతయ్యే సన్నివేశాన్ని కంపోజ్ చేసిన విధానం మాత్రం ఆయన సీనియారిటీని చాటుతుంది. సో, ఓవరాల్ గా ఒక చరిత్రను వీలైనంతవరకూ ఎలాంటి కాంట్రవర్సీలకు తావులేకుండా తెరకెక్కించాడు సంజయ్ లీలా భన్శాలీ. విడుదలకు ముందు సినిమా గురించి బాధపడిన రాజ్ పుత్ లు కూడా సినిమా చూశాక గర్వపడే స్థాయిలో సినిమా ఉంది.

విశ్లేషణ : “పద్మావతి” ఒక కమర్షియల్ సినిమా కాదు. అందువల్ల ఫస్టాఫ్ బాగా స్లోగా ఉందనిపిస్తుంది. అయితే.. అది కూడా కథలోని ఎమోషన్ ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం దర్శకుడు పడే తపన అని మలిభాగం మొదలయ్యాక అర్ధమవుతుంది.  పద్మావతిగా దీపికా చూపిన అసమానమైన నటచాతుర్యం, ఖిలిజీ సుల్తాన్ పాత్రలో రణవీర్ ప్రదర్శించిన క్రౌర్యం, భన్సాలీ చరిత్రను ఘనమైన రీతిలో చిత్రీకరించిన విధానం కోసం “పద్మావత్” చిత్రాన్ని ఎలాంటి సందేహం లేకుండా చూడవచ్చు. అయితే.. చిత్రాన్ని 3డి లో చూడడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు కాబట్టి బెటర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం “పద్మావత్” చిత్రాన్ని 2డి వెర్షన్ లో చూడడం ఉత్తమం.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus