శతచిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన 101వ సినిమా “పైసా వసూల్”. పూరీ మార్క్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ముందు ప్రకటించిన విడుదల తేదీ కంటే మూడు వారాలు ముందే విడుదలైంది. ముఖ్యంగా టీజర్ అండ్ ట్రైలర్ తో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న “పైసా వసూల్” సినిమా వారిని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : తేడా సింగ్ (నందమూరి బాలకృష్ణ) తీహార్ జైల్ నుంచి అప్పుడే విడుదలై హైద్రాబాద్ కి వచ్చిన ఓ చిన్నసైజు రౌడీ. సిటీలో అడుగుపెట్టడంతోనే “బాబ్ మార్లీ” (విక్రమ్ జిత్) అనే గ్యాంగ్ స్టర్ కు చెందిన మనుషులను టార్గెట్ చేసి.. విచ్చలవిడిగా గొడవలు పెట్టుకుంటుంటాడు. తేడా సింగ్ యాటిట్యూడ్ తోపాటు యారొగెన్స్ కూడా నచ్చిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్మయి (కైరా దత్) మరియు ఇండియన్ రా ఏజెన్సీ చీఫ్ (కబీర్ బేడీ) బాబ్ మార్లీని చంపడానికి తేడా సింగే సరైనోడు అనుకోని అతడ్ని అండర్ కవర్ కాప్ గా నీయమిస్తారు. కట్ చేస్తే.. అసలు తేడా సింగ్ వచ్చిందే “బాబ్ మార్లీ” గ్యాంగ్ ను అంతమోండించడానికని, అతను తీహార్ జైల్ నుండి వచ్చినట్లు చెప్పినదంతా ఒట్టి కథేనని పోలీస్ టీం తోపాటు “బాబ్ మార్లీ” గ్యాంగ్ మెంబర్స్ కి కూడా తెలిసిపోతుంది. ఇంతకీ “తేడా సింగ్” అసలు పేరేమిటి? అతనికి “బాబ్ మార్లీ” అండ్ గ్యాంగ్ మీద పగ ఎందుకు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “పైసా వసూల్” చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : అసలు బాలయ్య ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది, ఆయన మామూలుగానే మాంచి ఊపు మీద ఉంటాడు. అలాంటిది పూరీ జగన్నాధ్ లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడి చేతిలో పడేసరికి.. మన బాలయ్యలోని చిలిపిదనం బయటకొచ్చింది. ఈ సినిమాకి బాలయ్య యాటిట్యూడ్ పెద్ద ప్లస్ పాయింట్. తేడా సింగ్ పాత్రలో బాలయ్య చెప్పే డైలాగ్స్, మేనరిజమ్స్ కి థియేటర్ లో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవ్వడం ఖాయం. ఇక ఫైట్ సీన్స్, సాంగ్స్ లో బాలయ్య ఎనర్జీ లెవల్స్ కి మెచ్చుకొని, ముచ్చటపడకుండా ఉండలేం. శ్రియ, ముస్కాన్, కైరా దత్ వంటి అందగత్తెలందరూ ఒక్కో పాట చొప్పున పంచుకొని.. కుదిరినంతలో బాలయ్యతో సరసాలాడి సైడైపోయారు. విక్రమ్ జిత్ స్టైలిష్ విలన్ గా లుక్స్ ప్రకారం ఆకట్టుకొని.. నటన విషయంలో మాత్రం తేలిపోయాడు. పృధ్వీరాజ్ కామెడీ చేద్దామనుకొన్నప్పటికీ.. బాలయ్య అతడ్ని బీట్ చేసేశాడు. ఇక కబీర్ బేడీ, ఐ.శ్రీకాంత్ లు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు : పాటలతో పర్వాలేదనిపించుకొన్న అనూప్ ఎప్పట్లానే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చేతులెత్తేశాడు. అద్భుతమైన ఎనర్జీ లెవల్స్ తో బాలయ్య వెండితెరపై శివతాండవం చేస్తుంటే.. ఆ ఎనర్జీని ప్రేక్షకుడిలో తన మ్యూజిక్ తో ఇంకాస్త పంప్ చేయాల్సిన అనూప్.. నీరసం తెప్పించాడు. ముఖేష్.జి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఫైట్స్ సీక్వెన్స్ లను రెగ్యులర్ మాస్ యాంగిల్ లో కాకుండా స్టైలిష్ గా ప్రెజంట్ చేశారు. అలాగే.. బాలయ్యను వీలైనంత స్టైలిష్ గా చూపించారు. పోర్చుగల్ అందాలను ఎలివేట్ చేసిన డ్రోన్ షాట్స్ బాగున్నాయి.
డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మొదటిసారిగా దర్శకుడిగానే కాక రచయితగానూ నిరాశపరిచాడు. షూటింగ్ ప్రారంభం రోజున “ఈ సినిమాలోని పంచ్ డైలాగ్స్ తో ఒక పుస్తకమే రాయొచ్చు” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన పూరీ సినిమా మొత్తానికి కలిపి కనీసం 10 పంచ్ డైలాగులు కూడా లేకపోవడం గమనార్హం. ఇక బాలయ్య యాటిట్యూడ్ అండ్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన ధ్యాస మన పూరీగారు కాస్త కథ-కథనాల మీద కూడా కాన్సన్ ట్రేట్ చేస్తే బాగుండని మరోమారు అనిపించింది. ఫస్టాఫ్ వరకూ వన్ వేలో వేగంగా వెళ్ళిన పూరీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి రాంగ్ రూట్ లో ఎంటరైన షేర్ ఆటోలాగా ఎక్కడెక్కడో చక్కర్లు కొట్టి మొత్తానికి సినిమా అయ్యింది అనిపించాడు. అయితే.. పూరీ చేసిన మంచి పనేమిటంటే.. ఇంటర్వెల్ బ్యాంగ్ తోపాటు క్లైమాక్స్ షాట్ లో “ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీస్, ఔటర్స్ నాట్ ఎలౌడ్” అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసి.. “పైసా వసూల్” సినిమాకి జస్టిఫికేషన్ ఇచ్చేయడం ఓ విధంగా ప్రశంసనీయమే. అయితే.. పూరీ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ నుండి ఇలాంటి యావరేజ్ స్టఫ్ ను ఎక్స్ పెక్ట్ చేయడం అటుంచి.. చూసి చూసి ప్రేక్షకులు బోరైపోయారు. నిజానికి.. ఒక్క బాలకృష్ణ తప్పితే సినిమాలో ఆకట్టుకొనే అంశం ఒక్కటి కూడా లేకపోవడం సినిమాకి మైనెస్సే. సో, పూరీ ఇకనైనా ఆ మాఫియా మత్తును వీడి.. కాస్త అర్ధవంతమైన చిత్రాలు తీయాలని కోరుకుందాం.
విశ్లేషణ : ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ లో పూరీ పర్టిక్యులర్ గా చెప్పినట్లుగా “పైసా వసూల్” పక్కా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. అభిమానులు ఎంజాయ్ చేయదగ్గ అంశాలు పుష్కలంగా ఉన్నాయి, అన్నిటికంటే బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. కానీ.. సగటు సినిమా అభిమానికి మాత్రం సరైన కథ-కథనం కొరవడిన “పైసా వసూల్” నచ్చే అవకాశాలు చాలా తక్కువ.