ఈ మధ్య కాలంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఫ్లాపైన సినిమాలలో సన్నాఫ్ ఇండియా ఒకటనే సంగతి తెలిసిందే. మోహన్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కగా తొలిరోజే ఫ్లాప్ టాక్ తో ఈ సినిమా షోలు రద్దయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా రిజల్ట్ కు సంబంధించి దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే పరుచూరి గోపాలకృష్ణ మోహన్ బాబు తను చెప్పిన విధంగా చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పారు.
సన్ ఆఫ్ ఇండియా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయవద్దని ఓటీటీలో రిలీజ్ చేయాలని తాను కోరానని నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో మోహన్ బాబు ఎన్నో అద్భుతమైన చిత్రాలను, సందేశాత్మక చిత్రాలను ఇచ్చారని ఆయన అన్నారు. గొప్ప మెసేజ్ తో సన్ ఆఫ్ ఇండియా సినిమాను తెరకెక్కించారని నా మాటను గౌరవించి సన్ ఆఫ్ ఇండియా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని కోరినా మోహన్ బాబు వినలేదని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
మోహన్ బాబుతో చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉందని మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం, బ్రహ్మ, అడవిలో అన్న సినిమాల కోసం తాను, అన్నయ్య కలిసి పని చేశామని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. అసెంబ్లీ రౌడీ సక్సెస్ తర్వాత మోహన్ బాబు ఇంటికి వచ్చి గజమాల వేశాడని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. సన్ ఆఫ్ ఇండియాలో మోహన్ బాబు మంచి డైలాగ్స్ చెప్పారని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
జై భీమ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి మంచి పని చేశారని ఆ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే సూర్యను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేది కాదని గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓటీటీనే బెస్ట్ అని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్ల గురించి మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన సన్ ఆఫ్ ఇండియా ఓటీటీలో ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.