యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ (Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వసూళ్లతో సక్సెస్ సాధించింది. సినిమా విడుదలైన వెంటనే కొన్ని మిశ్రమ స్పందనలు వచ్చినా, వసూళ్లు మాత్రం భారీగా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో మరింతగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూను అందిస్తూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ, సినిమాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు రొమాంటిక్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండి ఉంటే, సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళ్లేదని అభిప్రాయపడ్డారు. పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తరచూ స్టార్ హీరోల సినిమాలకు, ప్రత్యేకంగా నచ్చిన సినిమాలకు రివ్యూ ఇస్తూ ఉంటారు. ఈసారి ‘దేవర’పై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, కథ పరంగా కొంచెం చిన్నదే అయినా, దర్శకుడు కొరటాల శివ దానిని తన ప్రతిభతో చక్కగా తీసుకెళ్లారన్న వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ సన్నివేశాలను బాగా మలచడంలో శ్రద్ధ చూపినందుకు కొరటాల శివని ప్రశంసించారు. కథపై జాగ్రత్తలు తీసుకుని, ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కథను ప్రదర్శించారని, అందుకు ఆయనను అభినందించారు. ఎప్పటిలాగే ఎన్టీఆర్ తన నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రెండు విభిన్న పాత్రలలో నటించి, నటుడిగా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఇలాంటి పాత్రలు తానెంత బాగా చేయగలడో ఎన్టీఆర్ ఈ చిత్రంతో చూపించాడు.
దేవర సినిమాలో సీన్‌లు సముద్రం నేపథ్యంలో ఎక్కువగా ఉండటం వల్ల, తానెంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో చెప్పడం అవసరం లేదు అని పరుచూరి గారు అభిప్రాయపడ్డారు. దేవరలో మ్యూజిక్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనిరుధ్ (Anirudh Ravichander) అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలైనప్పటి నుంచి దేవర సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అనిరుధ్ బీజీఎం సినిమాకి గొప్ప బలం అని పరుచూరి గారు అన్నారు.