2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల జాబితాను పరిశీలిస్తే జైలర్ సినిమా ఆ జాబితాలో ముందువరసలో ఉంటుంది. వరుస ఫ్లాపుల తర్వాత రజనీకాంత్ కోరుకున్న బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమాతో దక్కింది. నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతమైన కథ, కథనానికి అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం తోడవడం ఈ సినిమా సక్సెస్ కు కారణమైందని చెప్పవచ్చు. పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమాను ఓటీటీలో చూసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
జైలర్ మూవీలో (Jailer Movie) చూపించిన విధంగా దేవుడి విగ్రహాలను చోరీ చేయడం గతంలో చాలా సినిమాలలో చూపించారని ఆయన తెలిపారు. జైలర్ సినిమాలో రజనీ రోల్ ను రెండు ఎలివేషన్స్ ఉన్న రోల్ గా అద్భుతంగా చూపించారని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. రజనీని యంగ్ గా చూడాలని కోరుకునే ఫ్యాన్స్ కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను పెట్టారని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.
రజనీకాంత్ ఈ సినిమాలో కొత్త స్టైల్ లో కనిపించారని ఆయన అన్నారు. సినిమా ప్రారంభంలోనే దొంగతనం సీన్ చూపించి ప్రేక్షకులకు క్లూ ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు. సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం జరుగుతుందని ప్రేక్షకులు భావిస్తారని కానీ మనవడిని తెచ్చి కథను మలుపు తిప్పారని పరుచూరి అన్నారు. రమ్యకృష్ణ రోల్ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడ్డాడని ఆయన కామెంట్లు చేశారు.
డైరెక్టర్ అనుకుంటే సినిమాలో 20 నిమిషాల సీన్లు కట్ చేయొచ్చని అలా చేసి ఉంటే సినిమాలో కామెడీ ఉండేది కాదని పరుచూరి వెల్లడించారు. ఈ సినిమా కథను మరో విధంగా కూడా చూపించవచ్చని కొడుకు జైలుకు వెళ్లి మంచివాడిగా మారినట్టు రాసుకోవచ్చని అయితే నెల్సన్ మాత్రం మరోలా ఈ సినిమా కథను రాసుకున్నాడని పరుచూరి వెల్లడించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడం ఆయన చేస్తున్న గొప్ప పని అని పరుచూరి పేర్కొన్నారు.