పరుచూరి బ్రదర్స్.. వీరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతగా తమ రచనలతో పాపులర్ అయ్యారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలారు. ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ.. సినిమాలకు రచన చేసేవారు పరుచూరి వెంకటేశ్వరావు. ఉయ్యూరు కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ అన్నయ్యకు అప్పుడప్పుడూ రచనల్లో సాయం చేసేవాడు తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ. నందమూరి తారక రామారావు ఈ దిగ్గజాలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అప్పటినుంచి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో రచయితలుగా చక్రం తిప్పారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా.. కొన్ని సినిమాలను డైరెక్ట్ కూడా చేశారు. అలానే కొన్ని సినిమాల్లో నటించి నటులుగా కూడా సత్తా చాటారు. అయితే కొంతకాలంగా ఈ బ్రదర్స్ సైలెంట్ అయిపోయారు. పరుచూరి గోపాలకృష్ణ అప్పుడప్పుడు యూట్యూబ్ లో వీడియోలను రిలీజ్ చేస్తుంటారు. పాత విషయాలను పంచుకుంటూ కొన్ని వీడియోలను షేర్ చేశారు.
అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత విషయాలపై కూడా స్పందిస్తుంటారు. అయితే పరుచూరి వెంకటేశ్వరావు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఆయన వయసు దాదాపు ఎనభై ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్యు- సమస్యలతో బాధపడుతున్నారాయన. బయటకు పెద్దగా రావడం లేదు. వయోభారంగా కాస్త కృంగిపోయారు కూడా. ఇటీవల ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాంజీ.. పరుచూరి వెంకటేశ్వరావుని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ ఫొటోలు కాస్త వైరల్ అయ్యాయి. పరుచూరిని అలా చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ‘గురువు గారు ఇలా అయిపోయారేంటి..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.