మీటూ ఉద్యమం రోజు రోజుకి పెరిగిపోతోంది. బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా.. కోలీవుడ్ లో చిన్మయి తదితరులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకోవడంతో .. సినీపరిశ్రమలో చాలామంది తమ బాధని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మలయాళ కుట్టీ పార్వతి మీనన్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనం కలిగించాయి. మలయాళంతో పాటు తమిళంలోనూ అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ.. ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంది. అయితే దానికి కారణం మాళయాల హీరో దిలీప్ అని అప్పట్లో మీడియా కోడై కూసింది. గతంలో నటుడు దిలీప్‌ను మళయాల సినీ సంఘంలోకి తీసుకోవడంతో పార్వతి వ్యతిరేకించడం… అత్యాచార కేసులో ఉండగా సంఘంలోకి అతన్ని ఎలా తీసుకుంటారని… తీవ్రంగా వ్యతిరేకించింది.
దీంతో అక్కడ తనకు అవకాశాలు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని పార్వతి కొన్ని రోజుల క్రితం ఆరోపించింది. ఇప్పుడు మీటూ ఉద్యమం ఉదృతం కావడంతో పార్వతి మీడియా ముందుకు వచ్చింది. తాను సినిమా పరిశ్రమలోనే కాకుండా చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యానని పేర్కొంది. “నాపై లైంగికదాడి మూడేళ్ల వయసులోనే జరిగింది. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా మనశ్శాంతి దూరమవుతోంది” అని పార్వతి వెల్లడించింది. ఈ మాటలు ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే హాట్ టాపిక్ అయింది.