మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అనే సామెత మీకు తెలుసా? దీని గురించి క్లియర్‌గా అర్థం కావాలంటే ప్రజెంట్ బాలీవుడ్ పరిస్థితి చూస్తే తెలిసిపోతుంది. సరైన విజయాలు లేక ఈసురోమంటున్న బాలీవుడ్ మీద బాయ్‌కాట్ అనే ట్రెండ్ వచ్చి పడింది. ఏ సినిమా తీసినా ఏదో విషయం పట్టుకుని పెద్ద పంచాయితీ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. తాజాగా షారుఖ్ ఖాన్ – దీపిక పడుకొణె ‘పఠాన్’ సినిమా మీద పడ్డారు. ఈ సినిమా పాటల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి.. ఏకంగా బాయ్‌కాట్ పిలుపునిచ్చారు.
‘పఠాన్’ సినిమా బాయ్‌కాట్ విషయం సమసిపోయేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు తమ మార్పులు సూచించింది. సినిమా టీమ్ కూడా ఆ మార్పులు చేసి ఇచ్చింది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను జనవరి 25న విడుదల చేస్తున్నారని సమాచారం. అయితే ఏయే మార్పులు చేశారు సినిమాలో అనే విషయంలో కొన్ని విషయాలు బయట చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం చూస్తే.. సినిమాలో కొన్ని రంగుల మార్పులు, పదాల తొలగింపులు ఉన్నాయట.
‘పఠాన్’ సినిమాలోని ‘బేషరమ్ రంగ్..’ అనే పాటలో దీపికా పడుకొణె వైరల్ ‘సైడ్ పోజ్’ను సెన్సార్ టీమ్ తొలగించమని సూచించింది అని సమాచారం. అలాగే దీపికా పడుకొణె వేసుకున్న కాషాయ రంగు బికినీ, షారుఖ్ ఖాన్ వేసుకున్న ఆకుపచ్చ చొక్కాల విషయంలోనూ మార్పులు చేశారు అని అంటున్నారు. వీటితోపాటు ‘బహుత్ తాంగ్ కియా…’ అనే పాట లిరిక్స్‌లో కొన్ని షాట్లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు రా, పీఎంఓ వంటి మాటలు, పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేశారని అంటున్నారు. అలాగే కొన్ని అసభ్య పదాలను మ్యూట్ చేశారని సమాచారం.
CBFC మార్గదర్శకాల ప్రకారం ‘పఠాన్’ ఎగ్జామినింగ్ ప్రాసెస్ పూర్తయింది. మేం సూచించిన మార్పులను అమలు చేయాలని, థియేట్రికల్ రిలీజ్‌కు ముందు రివైజ్డ్ కాపీని సమర్పించాలని మేకర్స్‌కు కమిటీ చెప్పింది అని సెన్సార్ బోర్డు టీమ్ సభ్యులు తెలిపారు. ‘బేషరమ్ రంగ్…’ పాటలో దీపికా, షారూఖ్ ధరించిన కాస్ట్యూమ్‌ల రంగుల గురించి సెన్సార్ టీమ్ మాట్లాడుతూ, కాస్ట్యూమ్ కలర్స్ విషయంలో కమిటీ నిష్పక్షపాతంగా ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు మేం ఏం చేశాం అనేది తెలుస్తుంది అని చెప్పారు.