రేసుగుర్రం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జై లవకుశ, అజ్ఞాతవాసి.. ఇలా అనేక సినిమాల్లో పవిత్ర లోకేష్ నటించి మంచి గుర్తింపు సాధించుకున్నారు. కన్నడలో హీరోయిన్ గా అనేక చిత్రాలను చేసిన ఈమె రీ ఎంట్రీలో హీరోయిన్, హీరోల తల్లిగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తెలుగులో పున్నాగ సీరియల్లోను నటించి బుల్లి తెర ప్రేక్షకులను సైతం మెప్పించారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. “నా తండ్రి మైసూర్ లోకేష్. అతను 400 కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేను పదోతరగతిలో ఉండగా అయన మరణించడంతో .. చాలా కష్టాలు అనుభవించాము. అమ్మ టీచర్ గా పనిచేస్తే, నేను డేటా ఎంట్రీ వర్క్ చేసాను. ఆ సమయంలో మా ఇంటికి స్టార్ హీరో అంబరీష్ వచ్చినప్పుడు సినిమాల్లోకి ఆహ్వానించారు. అలా 16 వ ఏటా పరిశ్రమలోకి అడుగు పెట్టాను” అని తన సినీ రంగ ప్రవేశం గురించి వివరించారు.
ఇంకా మాట్లాడుతూ “శ్రీదేవి లా పెద్ద హీరోయిన్ గా మారతానని, నాకు గ్రాండ్ వెల్కమ్ ఉంటుందని భావించాను. కానీ అవన్నీ నిజం కాదని తెలుసుకోవడానికి తక్కువ సమయం పట్టింది. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం సెకండ్ హీరోయిన్ గా చేసాను. కొన్ని సార్లు విలన్ పాత్రల్లో కూడా నటించాను” అని పేర్కొన్నారు. ఇష్టం లేకున్నా కూడా కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో ఎంట్రీ గురించి మాట్లాడుతూ “నా సినిమాలను చూసి భీమనేని శ్రీనివాస్ దొంగోడు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రస్థానం, రేసుగుర్రం సినిమాలతో వెనక్కి తిరిగి చేసుకోలేదు” అని పవిత్రా లోకేష్ స్పష్టం చేశారు.