పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేసిందో చూశాం. బయట ఆడియన్స్ నుంచి కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినా, పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా ఫుల్ కిక్ ఇచ్చింది. తమ హీరోను ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న టైమ్ లోనే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కు ఒక ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.
అందరూ సినిమా హిట్టయిన ఆనందంలో ఇచ్చారేమో అనుకున్నారు. కానీ దీని వెనుక ఎవరికీ తెలియని ఒక ఎమోషనల్ స్టోరీ ఉందట. అసలు విషయం ఏంటంటే.. ఓజీ షూటింగ్ టైమ్ లో కొన్ని కీలక సన్నివేశాలను జపాన్ లో తీయాలని సుజిత్ ప్లాన్ చేశారు. కానీ అప్పటికే బడ్జెట్ హద్దులు దాటడంతో నిర్మాత దీనికి వెనకడుగు వేశారట. ఆ సీన్స్ సినిమాకు చాలా అవసరం అని భావించిన సుజిత్, ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
సినిమా క్వాలిటీ కోసం సుజిత్ తన దగ్గరున్న సొంత ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్’ కారును అమ్మేసి, ఆ డబ్బుతో జపాన్ షెడ్యూల్ పూర్తి చేశారట. ఒక డైరెక్టర్ సినిమా కోసం తన సొంత వాహనాన్ని త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం సినిమా రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిందట.
తన కోసం, సినిమా అవుట్ పుట్ కోసం సుజిత్ పడ్డ తపన, చేసిన త్యాగం చూసి పవన్ చలించిపోయారు. వెంటనే సుజిత్ ఏ మోడల్ కారు అయితే అమ్ముకున్నారో, అదే మోడల్ కొత్త కారును కొనిచ్చి గిఫ్ట్ గా ఇచ్చారు. అంతేకాదు, దానికి సంబంధించిన ఈఎంఐలు కూడా పవనే కడుతున్నారట. మొత్తానికి తెరపై కనిపించిన ఆ విజువల్స్ వెనుక డైరెక్టర్ ఇంత త్యాగం ఉందన్నమాట. ఒక అభిమానిగా మొదలై, హీరో కోసం కారునే వదులుకునే స్థాయికి ఎదిగిన సుజిత్ డెడికేషన్ కు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
