Pawan Kalyan: వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్

  • September 4, 2024 / 08:17 PM IST

ఎన్నడూ లేని విధంగా.. గత వారం రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బాగా నలిగిపోయారు. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం కావడంతో ఇళ్లల్లోకి వర్షపు నీరు, డ్రైనేజీ నీరుతో కలిసి రావడం.. ఇంట్లో సామాన్లు సైతం ప్రవాహానికి కొట్టుకుపోవడంతో చాలా మంది జనాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే వరదల కారణంగా తెలంగాణలో 17 మంది చనిపోయారు. ఆంధ్రాలో ఈ లెక్క ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం.

Pawan Kalyan

పంట నీటిపాలైపోవడంతో రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. అలాగే ఇంకొంతమందికి తినడానికి తిండి, తాగడానికి నీరు వంటివి లేక విలవిలలాడుతున్న సందర్భాలు ఎన్నో మనం న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. ఇక వీరిని ఆదుకోవడమే లక్ష్యంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు అంతా తమ వంతు సాయం చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మహేష్ బాబు  (Mahesh Babu) , చిరంజీవి  (Chiranjeevi)  , ఎన్టీఆర్ (Jr NTR)  , అల్లు అర్జున్  (Allu Arjun)  వంటి వారు కోటి చొప్పున విరాళం ప్రకటించారు.

ఇక ప్రభాస్  (Prabhas)కూడా రూ.2 కోట్లు విరాళం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా భారీ విరాళం ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించారు.

అంతేకాకుండా పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరదల వల్ల ఇబ్బంది పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి గాను రూ.1 లక్ష చొప్పున… మొత్తంగా రూ.4 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి.. ఇప్పుడు మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.6 కోట్ల భారీ విరాళం ప్రకటించినట్టు స్పష్టమవుతుంది. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

 ‘దావుది’ సాంగ్ పోస్టర్స్ పై ట్రోలింగ్.. ఏమైందంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus