ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడిన తొలి వ్యక్తి… పవన్ కల్యాణ్. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చాలా స్ట్రాంగ్‌గా రెయిజ్ చేశారు. అయితే ఆ తర్వాత ఆయనకు పరిశ్రమ నుండి ఎలాంటి సపోర్టు రాలేదు. అంతేకాదు ఆ విషయంలో సీరియస్‌నెస్‌ను తగ్గించడానికి చాలా ప్రయత్నాలు కూడా జరిగాయి. టాలీవుడ్ పెద్ద నిర్మాతలు ఆయన్ను, మరోవైపు ఏపీ ప్రభుత్వాన్ని కలసి కూల్ చేసే ప్రయత్నాలు చేశారు.
ఇంత చేసిన ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు, చతుర్లు, కౌంటర్లు ఆపలేదు. మరోసారి పవన్ తన పదునైన విమర్శలు ఏపీ ప్రభుత్వం మీద చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, భూ నిర్వాసితులకు మద్దతుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తగ్గించిన సినిమా టికెట్ల ధరపై పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సినిమా టికెట్ ధరలు తగ్గించి, షోలు పెంచుకోకుండా చేసి… నా ఆర్ధిక మూలాలలు దెబ్బకొట్టాలని చూస్తున్నారు అయినా ఫర్వాలేదు. ఒకవేళ నా సినిమాలు ఆపేసినా నేను భయపడను. ఎవరైనా పంతానికి దిగితే ఆంధ్రలో నా సినిమాలు ఉచితంగా చూపిస్తా అంటూ కౌంటర్ వేశారు పవన్. సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత లేదు అంటున్నారు. అలా అయితే మీరు అమ్మే మద్యం విషయంలో ట్రాన్సఫరెన్సీ ఉందా అని పవన్ ప్రశ్నించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.