రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు (శనివారం) తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో హత్యకు గురైన తిరుపతికి చెందిన వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం తిరుపతికి వెళ్లిన పవన్ కళ్యాణ్… పరామర్శ అనంతరం తిరుమల వెళ్లి వేంకటేశ్వరుని దర్శించుకుని తిరుమలలోనే బస చేశారు. శనివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని ఇందిరా మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ సభకు పోలీసుల అనుమతి కూడా లభించింది. పోలీసు బలగాలు సరిపడా లేవని జనసేన నేతలకు తిరుపతి ఎస్పీ విజయలక్ష్మీ తెలిపారు. తమ పార్టీ వలంటీర్లతో సభ ప్రశాంతంగా నిర్వహించుకుంటామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇవ్వడంతో పోలీసులు బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. ఈ సభలో పవన్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఏర్పాటు చేస్తున్న సభ కావడంతో అభిమానులు ఎక్కువ సంఖ్యలో హాజరు కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus