విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) ఆధ్వర్యంలోని పీపుల్ టెక్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అడుగులు వేస్తున్నాయి. సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ పేరు సంపాదించిన ఈ సంస్థ, తాజాగా పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పార్క్ ఏర్పాటు చేయనుంది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) పీపుల్ టెక్ సీఈఓ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను చర్చించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.13,000 కోట్ల పెట్టుబడులు రాబడతామని, 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని విశ్వ ప్రసాద్ తెలిపారు. ఇది భారతదేశంలోనే మొదటి ప్రైవేట్ ఈవీ పార్క్ అని, ఈవీ తయారీ, ఆర్ అండ్ డి కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్ వంటి ప్రత్యేకతలతో ఇది నిలవనుందని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్‌పై స్పందిస్తూ, “ఈవీ పార్క్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది” అని తెలిపారు. కేంద్రం కాలుష్య నియంత్రణపై కృషి చేస్తుండగా, రాష్ట్రం కూడా ఈ ప్రాజెక్ట్‌తో ముందడుగు వేస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశానికి పీపుల్ టెక్ ప్రతినిధులతో పాటు, పరిశ్రమలో ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. సినీ రంగంలో విజయవంతమైన నిర్మాతగా ఉన్న విశ్వ ప్రసాద్, ఇప్పుడు పారిశ్రామిక రంగంలో భారీ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ఆయన గతంలో పవన్ కళ్యాణ్ తో బ్రో (BRO Movie) అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే మరో ప్రాజెక్ట్ కూడా చేయాలని అనుకుంటున్నారు.