రాజమౌళి సినిమాలు అంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు గ్రాండియర్ అంటే శంకర్, శంకర్ అంటే గ్రాండియర్ అంటూ ఆ తమిళ స్టార్ డైరెక్టర్ గురించి మాత్రమే చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు అతన్ని మించి రాజమౌళి సినిమాలు భారీ హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ‘బాహుబలి’ చిత్రం రెండు పార్టులు కలిపి రూ.250కోట్లకి తెరకెక్కించిన రాజమౌళి… ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఏకంగా రూ.570 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చాడు.
నిర్మాత దానయ్య ఈ ప్రాజెక్టు ఆరంభంలో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు తెలిపాడు. అయితే కరోనా వల్ల మేకింగ్ కాస్ట్ పెరిగిపోయిందని రాజమౌళి ఇటీవల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాన్ థియేట్రికల్ మరియు థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.850 కోట్లు రికవరీ అయినట్టు కూడా ఆయన తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
కాకపోతే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీకి రూ.250 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకోసం టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు దర్శకనిర్మాతలు. మంత్రి పేర్ని నాని తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ అసలు బడ్జెట్ ను రివీల్ చేశారు. పారితోషికాలు, జీఎస్టీ కాకుండా ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం మేకర్స్ రూ.336 కోట్లు ఖర్చు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో తమ సినిమాకి టికెట్ రేట్లు పెంచాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం కు వినతి పత్రం రాసినట్టు కూడా ఆయన తెలిపారు.
అయితే పారితోషికాలతో కలిపి ఈ సినిమా బడ్జెట్ ఎంత అయ్యి ఉంటుంది అనే వార్తలు ప్రస్తుతం జోరందుకున్నాయి. రాజమౌళి ఈ సినిమా కోసం తన టీంకి అయ్యే ఖర్చులు కాకుండా రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని వినికిడి. ఇక చరణ్, ఎన్టీఆర్ లకు చెరో రూ.40 కోట్లు చొప్పున పారితోషికం అందబోతుండడంతో పాటు లాభాల్లో వాటాలు కూడా తీసుకోబోతున్నారని, అలియా భట్, అజయ్ దేవగన్ వంటి పాత్రలతో కలుపుకుని మిగతా పాత్రలకి రూ.50 కోట్లు అంది ఉండొచ్చు అని అంచనా..! మరి ఈ లెక్కల్లో ఎంత వరకు నిజముందో తెలీదు కానీ పేర్ని నాని లీక్ చేసిన రూ.336 కోట్లు ఇప్పుడు చర్చనీయాశం అయ్యింది.