సినిమాల్లో ఎంత సాంకేతికతను వినియోగిస్తున్నారో? వాటిని పైరసీ చేయడానికి అంతకుమించిన తెలివితేటలు వాడుతున్నారు జనాలు. చాలా ఏళ్లుగా ఈ పైరసీ బూతం సినిమా పరిశ్రమను వేదిస్తున్నా.. దానికి విరుగుడు దొరకడం లేదు. అప్పుడప్పుడు పైరసీ రాకెట్లను పట్టుకుంటూ ఉంటారు. డీవీడీలు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అంతా ఆన్‌లైన్ అయిపోయింది. సినిమాను పైరసీ చేయడం, ఆన్‌లైన్‌లో పెట్టేయడం సహజం అయిపోయింది. అయితే ఇలాంటి ఓ టీమ్‌ను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఇంతకీ ఏమైందంటే?
తమ సినిమాను పైరసీ చేయడం ఒక మలయాళ నిర్మాణ సంస్థ తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఆ పని చేసిన వారి అంతు చూడాలని నిర్ణయించుకుంది. కొన్ని వారాల క్రితం ‘గురువయూర్ అంబాలనడియిల్’ అనే మలయాళ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చిన రెండో రోజే ఆన్‌లైన్‌లో సినిమా ప్రత్యకమైపోయింది. అది కూడా 4కె ప్రింట్. దీంతో షాక్ తిన్న నిర్మాతలు దీని మూలమేంటో తేల్చాలని ఫిక్స్ అయిపోయారు.
త్రివేండ్రంలోని ఆరిస్ మల్టీప్లెక్స్‌లో కొంతమంది బృందంగా ఏర్పడి రెండు మూడు షోలకు ఒకేసారి అయిదారు రిక్లైనర్ సీట్లు బుక్ చేసుకోవడం గమనించారు. అలా సినిమాకు వచ్చిన మొబైల్స్ లో 4K వీడియో రికార్డింగ్ చేస్తున్నారని పసిగట్టారు. దీనికి వాళ్లకు సహకరించిన అంశం థియేటర్ స్క్రీనింగ్ ప్రతి ప్రింట్‌కు ఇచ్చే ఓ వాటర్ మార్క్. థియేటర్లో సినిమా రికార్డింగ్ చేసేటప్పుడు ఏ స్క్రీన్‌లో పైరసీ జరిగిందో పట్టుకోవచ్చు.
‘రాయన్’ (Raayan) సినిమాని ఆ బ్యాచ్ రికార్డింగ్ చేసే పనిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వాళ్లపై నేరం ఋజువైతే జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల వాళ్లు కలిస్తే ఇలా పైరసీకారులను అరికట్టొచ్చు అని ఈ విషయం రుజువు చేస్తోంది. మరి మనవాళ్లూ ఇదే ప్లాన్, లేదంటే ఇలాంటిదే మరో ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఏదేమైనా రిక్లైనర్ సీట్లు ఎంత దెబ్బేసేయో చూడండి. సినిమా చూడటానికి సులువుగా ఉంటుంది అనుకుంటే.. పైరసీకి సులువు చేసుకున్నారు.