బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా, రిస్క్ చేయడానికి ఏ మాత్రం వెనుకడాని యువ హీరోగా టైగర్ ష్రాఫ్ పెట్టింది పేరు. ఎన్నో యాక్షన్ సినిమాలు, సీన్స్ చేసి మెప్పించాడు. తాజాగా తనలోని మరో కోణాన్ని ప్రజలకు చూపించాడు. అదే గాయకుడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘వందే మాతరం’ అంటూ ఓ ప్రత్యేక వీడియోను స్వయంగా ఆలపించి, నటించాడు. ఆ వీడియోకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ‘అదరగొట్టావ్ టైగర్’ అంటూ ట్వీట్ చేశారు.
‘హిందూస్థాన్ మేరీ జాన్’ అంటూ ప్రారంభమైన ఈ పాట భారతీయులందరినీ హత్తుకునేలా ఉంది. ‘ఇది కేవలం పాట మాత్రమే కాదు భావోద్వేగం. ఈ పాటను దేశానికి అంకితమిస్తున్నా’ అని టైగర్ ష్రాఫ్ ఈ పాటను షేర్ చేస్తూ రాసుకొచ్చారు. ఈ పాటను చూసిన ప్రధాని మోదీ… ‘టైగర్! ఈ పాట సృజనాత్మక ప్రయత్నం. ‘వందేమాతరం’ గేయంతో నువ్వు చెప్పిన విషయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను’ అని రాసుకొచ్చారు ప్రధాని మోదీ.
విశాల్ మిశ్రా స్వరాలందించిన ఈ గీతానికి కౌశల్ కిశోర్ సాహిత్యం అందించారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. టైగర్ ష్రాఫ్ గానం, తనదైన వైవిధ్య శైలి డ్యాన్స్‌తో అదరగొట్టాడు. దాంతోపాటు చక్కటి లొకేషన్లలో పాటను తెరకెక్కించారు. ఆ సన్నివేశాలు అదిరిపోయాయ్ అనే చెప్పాలి. మరి మోదీకి అంతగా నచ్చిన పాట మీరూ చూడాలని అనుకుంటున్నారా… అయితే చూసేయండి మరి.