బిత్తిరి సత్తి (Bithiri Sathi) అలియాస్ చేవెళ్ల రవి కుమార్ అందరికీ సుపరిచితమే. తీన్మార్ న్యూస్ ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయిన ఇతను ఆ తర్వాత పలు న్యూస్ ఛానల్స్ లో అలాంటి షోలే చేస్తూ వచ్చాడు. అటు తర్వాత సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెలబ్రిటీలను తన స్టైల్లో.. ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసి కొన్ని పాటలను తన స్టైల్లో పేరడీలు చేస్తున్నాడు బిత్తిరి సత్తి. అయితే తాజాగా ఇతను వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశం అయ్యింది.
Bithiri Sathi
వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ వీడియోలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే స్టైల్లో..స్నేహితులు, వారి స్వభావాన్ని వివరిస్తూ ఓ శ్లోకాన్ని, తన స్టయిల్లో ఆలపించాడు బిత్తిరి సత్తి. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అది చూసిన కొంతమంది ‘భగవద్గీతలోని శ్లోకాన్ని కించపరిచినట్టు’ బిత్తిరి సత్తిపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. మరోపక్క హిందూ సంఘాలు కూడా ఈ వీడియోపై మండిపడుతూ.. ‘హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని’ అభిప్రాయపడ్డారు.
అలాగే బిత్తిరి సత్తికి ఫోన్ చేసి వారు హెచ్చరించడం కూడా జరిగింది. ఆ వీడియోని తక్షణమే తొలగించి హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బిత్తిరి సత్తి మాత్రం తాను చేసిన వీడియోలో తప్పేమీ లేదు అంటూ సమర్ధించుకున్నాడు. దీంతో హిందూ సంఘాల వారు బిత్తిరి సత్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరి పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారో చూడాలి.