పోలీస్ మూవీ రివ్యూ

  • April 16, 2016 / 05:39 PM IST

‘రాజా రాణి’ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి హిట్టయ్యింది. దాంతో దర్శకుడు అట్లీకి స్టార్ హీరో విజయ్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. విజయ్, సమంత, అమీ జాక్సన్.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ కల నటీనటులతో అట్లీ తెరకెక్కించిన సినిమా ‘తేరి’. తెలుగులో ‘పోలీస్’గా అనువదించారు. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో.. రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ : జోసెఫ్ కురువిల్ల(విజయ్) కేరళలో ఓ మారుమూల గ్రామంలో కూతురు నివేదిత(నైనికా)తో కలసి సంతోషంగా జీవిస్తుంటాడు. పాపను పాఠశాలకు తీసుకువెళ్ళి, తీసుకురావడం.. బేకరీ చూసుకోవడం జోసెఫ్ దినచర్య. నివేదిత స్కూల్ టీచర్ అన్ని(అమీ జాక్సన్) జోసెఫ్ కురువిల్లను చూసి ప్రేమలో పడుతుంది. ఓ చిన్న గొడవ కారణంగా విజయ్ గతం బయటపడుతుంది. హైదరాబాదులో రౌడీలా తాట తీసిన డిప్యూటీ కమీషనర్ విజయ్ కుమార్ ఎందుకు పేరు మార్చుకున్నాడు? తన కుటుంబం అందర్నీ చంపిన వ్యక్తులను వదిలేసి కేరళలోని మారుమూల గ్రామంలో ఎందుకు జీవిస్తున్నాడు? చివరకు, ఏం జరిగింది? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు : విజయ్ కూతురిగా నటించిన నైనిక నటన ముద్దొస్తుంది. క్యూట్ అండ్ బబ్లీ డాటర్ పాత్రలో ఇరగదీసింది. తర్వాత మహేంద్రన్ గారు. ప్రతినాయకుడి పాత్రలో నటించిన ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. మహేంద్రన్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్, యాటిట్యూడ్.. ప్రతిదీ సూపర్. విజయ్ అభిమానులు అతడ్ని ఎలా చూడాలనుకుంటున్నారో.. దర్శకుడు అట్లీ రెండు క్యారెక్టర్స్ ను లా డిజైన్ చేశాడు. కమర్షియల్ హీరోఇజమ్ కనిపించింది. కానీ, తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారనేది సందేహమే. ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ నటన ప్రశంసనీయం. సమంత పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. చీరకట్టు, షార్ట్ హెయిర్ విగ్గు.. హాట్ హీరోయిన్ అమీ జాక్సన్ గెటప్ చూసి ప్రేక్షకులు షాకవుతారు. ఆమె పాత్రకు ప్రాముఖ్యత కూడా లేదు.

మొట్ట రాజేంద్రన్ సినిమా అంతా కనిపిస్తాడు. కానీ, కామెడీ చేయడానికి అతనికి పెద్దగా ఛాన్స్ దొరకలేదు. సమయం, సందర్భం కుదిరినప్పుడు ‘మీరే నాకంటే బెటర్ గా అలోచించి ఉంటారు’, ‘ఐ యామ్ వెయిటింగ్’ అంటూ నవ్వులు పూయించాడు. ప్రభు అతిధి పాత్రకు పరిమితమయ్యారు. చెప్పుకోదగ్గ స్థాయిలో మిగతా ఆర్టిస్టులు ఎవ్వరూ నటించలేదు.

సంగీతం – సాంకేతిక వర్గం : ‘కన్నుల్లో.. ‘ పాట మినహా మిగతావి బాగోలేదు. అనువాద సాహిత్యమూ చెవిలో జోరీగలా ఇబ్బంది పెట్టింది. నేపథ్య సంగీతంలో జి.వి.ప్రకాష్ ఎక్కువగా ఫ్యూజన్ మిక్స్ చేశాడు. ట్రైలర్ వినిపించిన సిగ్నేచర్ బీజియం, మరికొన్ని బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో బాగోలేదు. జార్జ్.సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సూపర్. ప్రతి ఫ్రేమూ ఓ బ్యూటిఫుల్ పెయింటింగ్. రోడ్ మీద ఫైట్, అందులో ఎడిటింగ్ బాగుంది. మిగతావి వేస్ట్. అంటోనీ ఎడిటింగ్ కట్స్ బాగున్నాయి. కానీ, సినిమా నిడివి ఎక్కువైంది. ఈజీగా అరగంట కత్తిరించవచ్చు.

దర్శకత్వం : ‘రాజా రాణి’ తరహాలో ఎమోషనల్, కామెడీ సన్నివేశాలను దర్శకుడు అట్లీ బాగా తీశాడు. కానీ, హీరోఇజమ్ ఎలివేట్ చేయడానికి చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, హీరోఇజమ్.. మూడింటిని బాలన్స్ చేయడంలో ఫెయిలయ్యాడు. పలు సన్నివేశాలను సాగదీశాడు. డ్రామా ఎక్కువైంది.

విశ్లేషణ : మాస్ హీరో కమర్షియల్ సినిమాల్లో కొత్త కథ ఉంటుందని ఆశించడం అత్యాశే. కానీ, ఇంత పాత కథను మాత్రం ఎవరూ ఊహించారు. ‘భాషా’ నుంచి సంక్రాంతికి విడుదలైన ‘డిక్టేటర్’ వరకూ చూసిన సిత్రమే ఈ పోలీస్. హీరో, కథా నేపథ్యం మారింది. హీరోని పోలీస్ చేసి ఢిల్లీ నిర్భయ ఘటన జోడించి తీసేశారు. సీన్లు కూడా కొత్తగా లేవు. స్కూల్ లో విలన్లను విజయ్ కొడుతుంటే.. ‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది. విజయ్ గతం చెప్పడం ప్రారంభించగా.. సినిమా క్లైమాక్స్ కనపడుతుంది. ప్రతి సీన్ ఆడియన్ ఊహకు తగ్గట్టు ఉంటుంది. అమీ జాక్సన్ ప్రేమించడానికి సరైన కారణం కనిపించదు. లాజిక్కులకు అందని సన్నివేశాలు కొకల్లలు. తెలుగులో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్.. ఇలా మాస్ ఇమేజ్ ఉన్న హీరో అయితే ఓకే. ఇక్కడ విజయ్ మార్కెట్, హీరోఇజమ్ అంతంత మాత్రమే. దాంతో భారంగా సినిమాను చూడవలసి వస్తుంది. ‘వాడికి చావు కంటే పెద్ద శిక్ష వేయాలని’ విలన్ చెబుతుంటే.. ఈ సినిమాకి రొటీన్ కంటే పెద్ద పదం వెతుక్కోవాలని అనిపిస్తుంది. ఇంత రొటీన్ బాదుడులోనూ కాస్త నవ్వులు, అక్కడక్కడా ఎమోషన్ సీన్లు ప్రేక్షకులను బ్రతికించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus