సినిమాలు – స్పోర్ట్స్ ఎంత వండర్‌ఫుల్ కాంబినేషనో… సినిమాలు – రాజకీయాలు అంతే అద్భుతమైన జోడీ. ఈ రెండింటినీ కలిపితే పెసరట్టు ఉప్మాలా ఉంటుందని ఫుడీస్ అంటూ ఉంటారు. అలాంటి పెసరట్టు ఉప్మ కాంబినేషన్‌లో టాలీవుడ్‌లో వరుస సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఏంటా సినిమాలు, ఎవరా హీరోలు, కథల సంగతేంటి, దర్శకులు ఎవరో ఓసారి చూద్దాం. సినిమాలో రాజకీయం చూపించాలి అంటే… కేవలం అదొక్కటే సరిపోదు. దాంతోపాటు ప్రేమకథ, ఊరు కథ, కుటుంబం ఇలా చాలా అంశాల్ని తీసుకోవాలి.
ఇప్పుడు టాలీవుడ్‌లో రూపొందుతున్న పొలిటికల్ డ్రామాలు కూడా అలా సిద్ధమవుతున్నవే. ప్రస్తుతం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీలు చేస్తున్న హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్, వైష్ణవ్‌తేజ్ లాంటివాళ్లు కనిపిస్తున్నారు
* చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’… మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి రీమేక్ అనే విషయం తెలిసిందే. పొలిటికల్ – ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కాంబినేషన్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. మోహన్‌రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
* బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. బాలయ్య డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఓ బాలయ్య రాజకీయ నాయకుడిగా, ఓ ప్రాంతం పెద్దగా కనిపిస్తారని టాక్. ఆ లెక్కన ఈ సినిమాలో పాలిటిక్స్ గట్టిగానే ఉంటాయి.
* ఎన్టీఆర్ – రాజకీయ సినిమా అంటే అభిమానులకు అంత రుచించదు. కానీ ‘వల్ల కాదు’ అనే మాట అస్సలు సహించని తారక్… ఇప్పుడు అలాంటి కథతోనే సిద్ధమవుతున్నాడు. కొరటాల శివతో చేయబోయే సినిమాలో తారక్ యంగ్ పొలిటీషియన్‌గా కనిపిస్తాడట. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది.
* ప్రభుత్వ వ్యవస్థలు, అవినీతి, రాజకీయం ఈ మూడు అంశాల కాంబినేషన్‌లో రామ్‌చరణ్ సినిమా సిద్ధమువుతోంది. శంకర్ – దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేసే పనిలో ఉన్నారు. శంకర్ – పాలిటిక్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గత చిత్రాలు చూస్తే తెలుస్తుంది.
* నితిన్ కథానాయకుడిగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నితిన్… మాచర్ల అనే ప్రాంతంలో సిన్సియర్ అధికారిగా ఉంటాడని, సమాజానికి చెడు చేసే రాజకీయ నాయకులతో పోరాడుతుంటాడని టాక్. ఈ క్రమంలో సినిమాపై రాజకీయ ప్రభావం గట్టిగానే ఉంటుందట.
* ‘ఉప్పెన’ మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్‌తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ కథలో కూడా పొలిటికల్ టచ్ ఉందట. మెడికల్ స్టూడెంట్స్, రాజకీయం మధ్య లింక్ ఏంటో సినిమా చూస్తే కానీ చెప్పలేం.