ఆ మధ్య ఓ హీరోయిన్ మాట్లాడుతూ… ఇప్పుడంటే ట్రోలింగ్, ట్రోలర్స్, మీమర్స్ అంటూ వచ్చారు కానీ.. ఒకప్పుడు జనాలే డైరెక్ట్‌గా మమ్మల్ని అనేవారు. వివిధ వేదికల మీద విమర్శించేవారు. కొన్ని మాసపత్రికలు, వార పత్రికలు అదే పనిగా మా మీద పుకార్లు పుట్టించేవి అని చెప్పింది. ఆ మాట వింటే ఇప్పటి సినిమా జనాలకు అర్థం కాకపోవచ్చు కానీ.. పాత తరం నటులు ఇప్పుడు మాట్లాడితే అప్పటి మాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా నాటి నటి పూజా భట్ నుండి కొన్ని కీలక వ్యాఖ్యలు బయటకు వచ్చాయి.
హీరోయిన్ అలియా భట్ తన కుమార్తె అంటూ గతంలో పూజా భట్ మీద కొన్ని పుకార్లు వచ్చాయి. తాజాగా వాటిపైనే పూజా భట్ మాట్లాడారు. దాంతో తండ్రితో ‘లిప్ లాక్’ అంటూ వచ్చిన పుకార్లపై కూడా స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి వదంతులు దేశంలో కొత్తేమీ కాదు. వాటికి బదులిచ్చి ఆ వ్యవహారానికి గౌరవాన్ని ఇవ్వకూడదు అంటూ ఘాటుగా కామెంట్స చేశారు పూజా భట్. ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ తొలి భార్య కుమార్తెనే ఈ పూజా భట్ అనే విషయం మీకు తెలిసిందే.
మహేష్ భట్‌కు అలియా భట్ రెండో భార్య కుమార్తె. అయితే వయసులో వ్యత్యాసం ఎక్కువగా ఉండటం, అప్పటి కొన్ని పుకార్ల వల్ల పూజా, ఆలియా తల్లీబిడ్డలు అని లేనిపోని మాటలతో పుకార్లు పుట్టించారు. ఇప్పుడు వాటి గురించే పూజా భట్ మాట్లాడారు. ఇటీవల పూజా మరో విషయంలో కూడా స్పందించారు. కొన్నాళ్ల క్రితం తన తండ్రిని పెదాల మీద పూజా ముద్దు ఇస్తున్నట్లు ఓ ఫొటో బయటకు వచ్చింది. అయితే అది ప్రేమతో ఇచ్చిన ముద్దు తప్పు అంతకుమించి లేదు అని పూజా ఇటీవల క్లారిటీ ఇచ్చింది.
ఇక పూజా భట్ సంగతి చూస్తే… ‘డాడీ’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘సడక్’, ‘దిల్ హై కీ మంతా నహీ’ లాంటి సినిమాలతో 19 ఏళ్లకే స్టార్ స్టేటస్ సంపాదించారు. ఆ తర్వాత నిర్మాతగా, సహాయ నటిగా మారిపోయారు. ‘సడక్ 2’, ‘బాంబే బేగమ్స్’, ‘చుప్’ చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించారు.