‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వాడిన భాషఅభ్యంతరకరంగా ఉందని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పోసాని.. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. జగన్ తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ఉందని.. కానీ ఆయన లాంటి వ్యక్తికాదని నమ్ముతున్నా అంటూ పోసాని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే తప్పు లేదు కానీ దానికి ఆధారాలు చూపించాలని అన్నారు.
చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులను అసభ్య పదజాలంతో అవమానించడం మీరు ఎప్పుడైనా చూశారా..? మీరు ఎవరిని ప్రేరణగా తీసుకొని దూషిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాడు. సాయి ధరమ్ తేజ్ సినిమా ఈవెంట్ కి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడాలి కానీ ఆ వేడుకలో సీఎం జగన్ ను, మంత్రులను నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని పోసాని ఫైర్ అయ్యారు. జగన్ కి కులపిచ్చి ఉందని నిరూపించగలరా..? అని ప్రశ్నించారు.
జగన్ కుటుంబంతో పదిహేను రోజులు పులివెందులలో ఉన్నానని.. వాళ్లంతా అక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంటారని చెప్పారు. జగన్ ప్రత్యేకంగా పులివెందులకు వెళ్లకపోయినా ఆయన గెలుస్తారని.. అలా ఎవరైనా గెలవగలరా..? అని ప్రశ్నించారు. పవన్ మీరు రెండు నియోజకవర్గాల్లో నిలిబడ్డారు..? ఒకదానిలోనైనా గెలిచారా..? అని విమర్శించారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని.. మీరు పెద్ద హీరో.. మీరు పరిష్కరించగలరని.. ముందు ఆ సమస్యలను పరిష్కరించండి అంటూ సూచించారు.