గతేడాది పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలైన సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించడం గురించి జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించకపోవడంతో పెద్ద సినిమాల విడుదలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. టికెట్ రేట్ల పెంపు కోసమే పలువురు పెద్ద సినిమాల నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేశారు. నిన్న సీఎం జగన్ ను చిరంజీవి మహేష్ తో పాటు ప్రభాస్ కూడా కలిశారనే సంగతి తెలిసిందే.
సాధారణంగా ప్రభాస్ ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉంటారు. అయితే సమస్య పరిష్కారం కొరకు ఏపీ సీఎం నుంచి ఆహ్వానం అందడంతో ప్రభాస్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభాస్ టికెట్ రేట్ల తగ్గింపు వల్ల సూళ్లూరుపేటలో నిర్మించిన మల్టీప్లెక్స్ స్క్రీన్ కు నష్టాలు వస్తున్నాయని చెప్పినట్టు తెలుస్తొంది. ఆ మల్టీప్లెక్స్ స్క్రీన్ ను ప్రభాస్ స్నేహితులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సకల సౌకర్యాలతో నిర్మించారు. ఇతర థియేటర్ల మాదిరిగా ఈ మల్టీప్లెక్స్ కు కూడా టికెట్ రేట్లను నిర్ణయించడం అన్యాయమని ప్రభాస్ జగన్ కు చెప్పినట్టు బోగట్టా.
అయితే జగన్ నుంచి ప్రభాస్ కు ఎలాంటి హామీ లభించిందనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. మరోవైపు ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతులు లేనట్టేనని సమాచారం. అయితే ఐదు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఉదయం 8 గంటల నుంచే థియేటర్లలో సినిమాలు ప్రదర్శితమయ్యే ఛాన్స్ ఉంది. త్వరలో కొత్త జీవోలో టికెట్ రేట్లకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
కొత్త టికెట్ రేట్లపై నిర్మాతలు, సినీ ప్రముఖులు పాజిటివ్ గా స్పందిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లు భావించవచ్చు. పెద్ద సినిమాలకు అనుకూలంగా టికెట్ రేట్లు ఉంటాయో లేదో చూడాలి. ఏపీ ప్రభుత్వం కొంతమేర టికెట్ రేట్లను పెంచితే మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పాలి.